Begin typing your search above and press return to search.

పోలీసుల పేరుతో సైబర్ క్రైమ్..నిరుద్యోగికి రూ. 7 లక్షల టోకరా

By:  Tupaki Desk   |   8 Oct 2021 12:30 PM GMT
పోలీసుల పేరుతో సైబర్ క్రైమ్..నిరుద్యోగికి రూ. 7 లక్షల టోకరా
X
సైబర్ క్రైమ్స్ ..ఊహలకి అందని విధంగా జరుగుతున్నాయి. ఒకసారి వాడిన ఫార్ములా మళ్లీ వాడకుండా సైబర్ నేరగాళ్లు నేరాలు చేస్తున్నారు. ఈసారి ఏకంగా తమ మోసాలకు పోలీసుల్నే వాడేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఆన్ లైన్ మోసం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమ్మాయిని వేధించినందుకు జైలు శిక్ష తప్పించుకోవాలంటే సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ కేటుగాళ్లు ఓ నిరుద్యోగి నుంచి రూ. 6.96 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఐడీఏ జీడిమెట్లకు చెందిన బాధితుడు ఎంఎస్సీ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నాడు.కొన్ని రోజుల కిందట crpccrime@gmail.com అనే ఐడీ నుంచి మెయిల్ వచ్చింది.మీరొక అమ్మాయిని వేధించారని, మీపైన 356(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. అమ్మాయితో ఉన్నట్లు బాధితుడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. అయితే, తనకు ఆ అమ్మాయి ఎవరో తెలియదంటూ బాధితుడు వాపోయాడు. అయినా సెప్టెంబర్ 10న మ. 12 గంటలకు తల్లిదండ్రులను తీసుకురావల్సి ఉంటుందని హెచ్చరించారు. హాజరు కాకపోతే పోలీసులే వెతుక్కుంటూ వస్తారని బెదిరించారు.

దీంతో ఏం చేయాలో అర్థం కాక మిత్రుని సలహా కోరాడు. వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ చేయగా అవతలి వ్యక్తులు పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆ అమ్మాయితో సెటిల్ చేసుకోమన్నారు. వాళ్ల బంధువులు ఫోన్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత నలుగురు ఫోన్లు చేశారు. వాళ్లు అడిగినప్పుడల్లా సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 3 మధ్య దఫదఫాలుగా రూ. 6.96 లక్షలు పంపించాడు. కేసు కొట్టేశారా... లేదా? అని తెలుసుకునేందుకు ఫోన్లు చేయగా స్విచ్ఛాప్ అని రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.