Begin typing your search above and press return to search.

ఏకంగా ప్రధాని పథకం పేరిట రూ.కోట్లు కొళ్లగొట్టేశారు!

By:  Tupaki Desk   |   20 Aug 2020 7:00 AM GMT
ఏకంగా ప్రధాని పథకం పేరిట రూ.కోట్లు కొళ్లగొట్టేశారు!
X
సైబర్ నేరగాళ్లు చోరీల్లో ఆరితేరి పోయారు. కొత్తపుంతలు తొక్కుతూ రోజుకోవిధంగా జనాల్ని మోసగిస్తున్నారు. ఇలా కూడా మోసపోవచ్చ అని మనం తెలుసుకునే లోపే అందినకాడికి సొమ్ము కాజేస్తున్నారు. ప్రధాని పేరిట ఓ పథకాన్ని పెట్టి అందులో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 15 వేల మందిన ప్రజలను చేర్పించి డబ్బు కొల్లగొట్టారు. 'ప్రధాన మంత్రి శిశు వికాస్ యోజన 'పథకం పేరిట వివిధ వెబ్ సైట్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి తెలివిగా డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. Www.pmsvy.cloud.in అనే నకిలీ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఆ పథకంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలను నమ్మించి.. డబ్బు వసూలు చేస్తున్నారని నేషనల్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ యూనిట్, స్పెషల్ సెల్ లో కేసు నమోదైంది.

వెబ్సైట్ లో రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ఏజెంట్లను నియమించి ఈ పథకం పేరు చెప్పి ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసినట్టు గుర్తించారు. బీహార్ రాష్ట్రం పాట్నా కు చెందిన పాండే, ఉత్తర ప్రదేశ్ అయోధ్య లో నివసిస్తున్న ఆదర్శ యాదవ్, అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దేశవ్యాప్తంగా తాము సేకరించిన 15 వేల మంది ప్రజల ధ్రువపత్రాల వివరాలను పాఠశాలలకు, ఆసుపత్రులకు ఇచ్చి కమీషన్ పొందాలని చూశారు. సైట్ లో నమోదైన వాళ్లకు చిన్నచిన్న పథకాల పేరు చెప్పి డబ్బు వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే పాట్నాకు చెందిన సువేంద్ర యాదవ్ 'ప్రధాన మంత్రి శిశు వికాస్ యోజన పేరిట' ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు తెలుసుకుని అతడిని కూడా అరెస్టు చేశారు. ఆ ముగ్గురి వద్దనుంచి ఏడు సెల్ ఫోన్లు, మూడు కంప్యూటర్లు, రెండు ల్యాప్ టాప్ లు, ప్రజల గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 'ప్రధాని శిశు వికాస్ యోజన పేరిట' తల్లిదండ్రుల నుంచి ప్రతి బిడ్డకు రూ.250 చొప్పున వసూలు చేశారు.

అందులో రూ. 50 ఏజెంట్లకు కమీషన్గా జిల్లా - రాష్ట్ర నిర్వాహకులకు మరో రూ. 50 పంచి మిగిలిన డబ్బులు తమ ఖాతాల్లో వేసుకునే వారు. తమిళనాడు - హర్యానా - మధ్యప్రదేశ్ - కర్ణాటక - కేరళ - జమ్ము కాశ్మీర్ - పంజాబ్ - గుజరాత్ - రాజస్థాన్ - మహారాష్ట్ర - గోవా - తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ - మిజోరాం - అరుణాచల్ ప్రదేశ్ - అస్సాం - సిక్కిం - హిమాచల్ ప్రదేశ్ - నాగాలాండ్ - త్రిపుర - ఉత్తరాఖండ్ - ఒడిశా - ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో వారు ఈ దోపిడీ కొనసాగించారు. ప్రభుత్వ సైట్ల పేరు చెప్పి - పథకాల పేరు చెప్పి ఎవరైనా డబ్బు అడిగితే నమ్మ వద్దని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.