Begin typing your search above and press return to search.

పార్ట్ టైం జాబ్ లింక్... అరకోటి పట్టేశారు!

By:  Tupaki Desk   |   11 July 2023 11:00 PM
పార్ట్ టైం జాబ్ లింక్... అరకోటి పట్టేశారు!
X
పార్ట్ టైం జాబ్స్ అంటూ ఆన్ లైన్ లో లింక్స్ కనిపిస్తే అస్సలు క్లిక్ చేయొద్దని పోలీసులు చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనవసరం అనిపించిన ఏ లింక్ పైనా క్లిక్ చేయొద్దని... ఒకవేళ అలాంటి లింక్స్ క్లిక్ చేసినప్పటికీ సెన్సిటివ్ సమాచారాన్ని మాత్రం అందించొద్దని కూడా హెచ్చరిస్తుంటారు. కానీ అదనపు ఆదాయానికి ఆశపడి చాలామంది ఇలాంటి లింక్స్ క్లిక్ చేసి మోసపోతున్నారు.

అవును... సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. టాస్క్ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ఉచ్ఛులోకి లాగి ఏకంగా 53 లక్షల రూపాయల కుచ్చుటోపీ పెట్టారని తెలుస్తుంది. దీంతో అంతా అయిపోయాక లబోదిబోమంటున్న ఆ ఇంజినీర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం టెలిగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ వచ్చిందట. ఓపెన్ చూసి చూడగా మేమిచ్చిన టాస్క్ పూర్తి చేస్తే ఇంటి వద్దనే కూర్చుని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని అందులో ఉందట. దీనికి స్పందించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తాను సిద్దమంటూ రిప్లై ఇవ్వగా సైబర్ నేరగాళ్లు అతనికి కొన్ని టాస్కులు ఇచ్చారట.

ఇదే విషయానికి సంబంధించి మరో మహిళకు కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందంట. దీంతో ఆమెకూడా లింక్స్ క్లిక్ చేసి టాస్ పూర్తిచేసే పనిలో పడిందంట. అలా పని పూర్తి చేయగానే... చెప్పినట్టుగానే నిజంగానే వీరిద్దరికీ డబ్బులిచ్చారంట. దీంతో వీరికి నమ్మకం బాగా పెరిగిందని అంటున్నారు.

ఈ సమయంలో ఎంత పెట్టుబడి పెడితే అందుకు రెట్టింపు లాభం వస్తుందని వీరిద్దరినీ నమ్మకబలికిన ఆ సైబర్ నేరగాళ్లు... ఏదోలా వీర్ని ఒప్పించగలిగారని అంటున్నారు. దీంతో.. అలా ఆ వ్యక్తి నుంచి 48 లక్షల రూపాయలు, మహిళ నుంచి 5 లక్షలు కాజేశారని తెలుస్తుంది. డబ్బులు కట్ అవ్వగానే... ఆ తర్వాత అన్ని లింక్స్ కట్ అయిపోయాయట.. ఫలితంగా వారితో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని తెలుస్తుంది.

దీంతో మోసపోయామని గ్రహించిన వీళ్లిద్దరూ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారని సమాచారం. వీరి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుల్స్తుంది. ఇలాంటి విషయాలు రెగ్యులర్ గా మీడియాలో దర్శనమిస్తున్నా... కొంతమందికి అవగాహన రావడం లేదో, లేక అత్యాశతో ఇలా దెబ్బతింటున్నారో తెలియడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు!