Begin typing your search above and press return to search.

ప్రసాదంలో సైనైడ్.. 20 నెలల్లో 10 హత్యలు

By:  Tupaki Desk   |   6 Nov 2019 4:13 AM GMT
ప్రసాదంలో సైనైడ్.. 20 నెలల్లో 10 హత్యలు
X
అతడో వాచ్ మెన్. అతడి పేరు సింహాద్రి అలియాస్ శివ. ఏమీ తెలియని అమాయకుడిలా కనిపించే అతడిలో సీరియల్ కిల్లర్ దాగున్నాడు. నమ్మిన వారిని నమ్మినట్లుగా లేపేసే దుర్మార్గమైన మరో మనిషి ఉన్నాడు. 20 నెలల వ్యవధిలో 10 మందిని హత్య చేసిన సీరియల్ నిందితుడిగా అతడ్ని చెప్పాలి. బంధువులు.. తెలిసిన వారు.. ఇలా ఎవరినీ వదిలి పెట్టని ఇతగాడి గుట్టును పోలీసులు రట్టు చేశారు.

అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ పని చేస్తూనే డబ్బు సంపాదించాలన్న కోరికతో అడ్డదారి పట్టిన ఇతగాడి గుట్టును పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఏలూరులో ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ ఈ కరుడుగట్టిన సైకో ఉదంతాన్ని వెల్లడించి సంచలనంగా మారారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం పంచాయితీకి చెందిన సింహాద్రి.. తక్కువ ధరకే రైస్ పుల్లింగ్ కాయిన్ ఇప్పిస్తానని.. సంపదను డబుల్ చేయిస్తానని మాయ మాటలు చెప్పేవాడు. తన మాటలతో బాధితుల్ని నమ్మించే అతడు.. ప్రసాదం పేరుతో ప్రమాదకర సైనైడ్ కలిపిన ఆహారాన్ని ఇచ్చేవాడు.

ఇదేమీ తెలీకుండా తినే బాధితులు.. రెండు.. మూడు రోజుల్లో మరణించేవారు. ఆ వెంటనే వారి దగ్గరున్న బంగారం.. డబ్బులతో పారిపోయేవాడు. ఇలా ఇప్పటివరకూ రూ.28.5 లక్షలు దోచుకున్నాడు. విజయవాడకు చెందిన షేక్ అమీనుల్లా ఇతనికి అవసరమైన సైనైడ్ ను సరఫరా చేసేవాడు. తాను టార్గెట్ చేసిన వారిని సింహాద్రి ఎలా హతమార్చేవాడన్న దానికి ఉదాహరణగా అతను చంపిన కాటి నాగరాజు ఉదంతం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

తక్కువ మొత్తానికే రైస్ పుల్లింగ్ కాయిన ఇస్తానని ఆశ చూపించి.. ఏలూరు శివారులోని వట్లూరుకు రప్పించాడు సింహాద్రి. అనంతరం సైనైడ్ కలిపిన ప్రసాదాన్ని ఇచ్చాడు. అది తిన్నంతనే అపస్మాకర స్థితికి చేరుకున్న అతని వద్ద ఉన్న రూ.2లక్షలు.. 4 సవర్ల బంగారం తీసుకొని వెళ్లిపోయాడు. రోడ్డు మీద పడి ఉన్న నాగరాజును స్థానికులు ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ మరణించాడు. గుండెపోటుతో అతను మరణించినట్లుగా భావించారు. అయితే.. ఆయన దగ్గర ఉండాల్సిన బంగారం.. డబ్బు మాయంకావటంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

బాధితుడి కాల్ డేటాతో ఆరా తీస్తే.. మొత్తం డొంక కదిలింది. సింహాద్రిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారించటంతో వణికించే నిజాల్ని బయటపెట్టాడు సింహాద్రి. ఈ సైకో సీరియల్ కిల్లర్ హతమార్చిన వారిలో సొంత బామ్మ.. వదిన.. ఇలా పలువురు ఉండటం గమనార్హం. మొత్తం పది మందిని హతమార్చగా ఆరుగురు మరణాలకు సంబంధించి ఎలా కేసు నమోదు చేయకపోగా.. అనుమానం కూడా కలుగలేదు. ఇతగాడి ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.