Begin typing your search above and press return to search.

పబ్ లో దొరికిన 45మంది బ్లడ్ శాంపిల్స్ సేకరణ: సీవీ ఆనంద్ కీలక నిర్ణయాలు

By:  Tupaki Desk   |   3 April 2022 1:30 PM GMT
పబ్ లో దొరికిన 45మంది బ్లడ్ శాంపిల్స్ సేకరణ: సీవీ ఆనంద్ కీలక నిర్ణయాలు
X
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పబ్ లో డ్రగ్స్ మూలాలు బయటపడడం.. పలువురు సెలబ్రెటీలు ఇందులో ప్రమేయం ఉండడం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే పోలీసుల దాడిలో దొరికిన 45మంది రక్త నమూనాలు సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ తెలిపారు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించారని సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొత్త సీఐ నియామకం అయ్యారు. కొత్త సీఐగా నాగేశ్వరరావు నియామకం అయ్యారు. ప్రస్తుతం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐగా ఉన్న నాగేశ్వరరావు.. ఆరేళ్లుగా టాస్క్ ఫోర్స్ లోనే పనిచేస్తున్నారు.

ఇక ఈ పబ్ లో డెకాయ్ ఆపరేషన్ ను నిర్వహించింది నాగేశ్వరరావు టీం కావడం గమనార్హం. డ్రగ్స్ గుట్టు బయటపెట్టింది ఈయనే. గతంలో ఎన్నో సంచలన కేసుల గుట్టు తేల్చారు నాగేశ్వరరావు. దీంతో ఈ కేసు విచారణ నాగేశ్వరరావుకు ప్రభుత్వం అప్పగించింది.

ప్రస్తుతం బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై గతంలో పలు సెటిల్ మెంట్ ఆరోపణలు, పబ్ లపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడకుండా నిరాకరించడం.. దురుసుగా ప్రవర్తించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. వెంటనే అతడిపై వేటు వేసినట్టు తెలిసింది.

ఈ కేసులో పలువురు ప్రముఖులు ఉన్నారని తేలడంతో పోలీసులు కేసును సవాల్ గా తీసుకున్నారు. డ్రగ్స్ విషయంలో నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. దీంతో ఇతడిని సీఐగా నియమిస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. సీఐగా నాగేశ్వరావును నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.

డ్రగ్స్ కలకలంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన సెక్టార్స్ ఎస్సైలు, డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లు రిపోర్టు చేయాలని సీవీ ఆనంద్ సూచించారు.