Begin typing your search above and press return to search.

అబ్బాయిలు , అమ్మాయిలు మధ్యలో పరదా ..

By:  Tupaki Desk   |   7 Sep 2021 10:23 AM GMT
అబ్బాయిలు , అమ్మాయిలు మధ్యలో పరదా ..
X
అఫ్గానిస్థాన్‌ లో తాలిబన్ల పాలనకు అద్దం పట్టే ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది. సోషల్ మీడియా లో ఆఫ్ఘానిస్తాన్ కి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. ముష్కరుల ఆక్రమణలతో యుద్ధ వాతావరణం నెలకొన్న అఫ్గాన్‌ లో ఇప్పుడిప్పుడే రోజువారీ కార్యకలాపాలు తిరిగి మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. తాజాగా కొన్ని ప్రావిన్స్‌ లలో విశ్వవిద్యాలయాలు ఓపెన్ చేశారు. దీనితో విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా తరగతి గదుల్లో పరదాలు ఏర్పాటు చేశారు.

దీనికి సంబంధించిన ఫొటోలను స్థానిక విలేకరులు కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రజా ప్రభుత్వం నుంచి ముష్కరుల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌లో భారీ మార్పులే చోటుచేసుకుంటున్నాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్పుకుంటూ వచ్చిన తాలిబన్లు, చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ విద్యాసంస్థలకు ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేటు యూనివర్శిటీలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నిఖాబ్‌ ధరించాలని తాలిబన్లు ఆదేశించారు. వేర్వేరు తరగతి గదుల్లో బోధించాలని చెప్పారు. అది కుదరకపోతే కనీసం వారి మధ్య కర్టెన్‌ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, అమ్మాయిలకు పురుషులు విద్యాబోధన చేయరాదని స్పష్టం చేసింది. అయితే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వయసులో పెద్దవారైన పురుష టీచర్లు వారికి బోధించాలని తెలిపారు. ఇక తరగతులు పూర్తయిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేసారి బయటకు వెళ్లకూడదట. ఒకే సమయంలో వెళ్తే బయటవారు మాట్లాడుకునే అవకాశముంటుందని దానిపైనా ఆక్షలు విధించారు. ముందు అబ్బాయిలంతా బయటకు వెళ్లిపోయిన తర్వాత అమ్మాయిలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.