Begin typing your search above and press return to search.

టెక్సాస్ లో కరెంట్ కట్.. కష్టాల్లో 23 లక్షల మంది

By:  Tupaki Desk   |   16 Feb 2021 9:30 AM GMT
టెక్సాస్ లో కరెంట్ కట్.. కష్టాల్లో 23 లక్షల మంది
X
తాజాగా విరుచుకుపడిన విపత్తుతో అమెరికా దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా టెక్సాస్ చిగురుటాకులా వణుకుతోంది. భారీ ఎత్తున వీస్తున్న మంచు తుపాను గాలులకు గజగజ వణుకుతున్నారు. చివరకు పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. అక్కడ పవర్ ఎమర్జెన్సీని విధించి.. కోతలు చేపట్టారు. అంతేకాదు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడా రాష్ట్రంలో విమాన సర్వీసుల్ని నిలిపివేశారు. కరెంటు కోతలతో లక్షలాది మంది అంధకారంలో బతుకుతున్నారు.

ఇక.. డల్లాస్.. హుస్టన్ నగరాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ లలోకి పడిపోయాయి. హిమపాతం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఇతర ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండటానికి వీలుగా పవర్ కట్ ను విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు సురక్షితంగా ఉండటమే ముఖ్యమని.. ఇప్పుడున్నపరిస్థితుల్లో విద్యుత్ వాడకం తగ్గించేందుకే కోతలు విధించినట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తాజాగా విధిస్తున్న కరెంటుకోతల కారణంగా 23 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అంతేకాదు.. రాష్ట్రంలో పలు నగరాల్లో కరెంట్ కోతలు.. ట్రాఫిక్ కష్టాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. టెక్సాస్ లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లుగా అధ్యక్షులు జో బైడెన్ వెల్లడించారు. రాష్ట్రంలోని 254 కౌంటీలకు గవర్నర్ గ్రెగ్ అబాట్ డిజాస్టర్ డిక్లరేషన్ జారీ చేశారు. ఎక్కడికక్కడ నేషనల్ గార్డ్ యూనిట్లను సమాయుత్తం చేశారు.

ఓవైపు కరెంటు కోతలు.. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు.. ఇంకోవైపు విమానాల రద్దీతో టెక్సాస్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సుమారు 120 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. సోమవారం 12 అంగుళాల వరకు మంచు కురవడం సహా తుపాను తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రతికూల వాతావరణం నుంచి అక్కడి వారు ఎప్పుడు బయటపడతారన్న విషయాన్ని అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.