Begin typing your search above and press return to search.

హైవే రోడ్డు పక్కన గుట్టలుగా కరెన్సీ నోట్ల తుక్కు

By:  Tupaki Desk   |   30 Dec 2021 4:10 AM GMT
హైవే రోడ్డు పక్కన గుట్టలుగా కరెన్సీ నోట్ల తుక్కు
X
ఖరీదైన కరెన్సీ నోట్లు. కాకుంటే.. చిరిగిపోయి.. ముక్కలు ముక్కలుగా ఉన్న తుక్కు పడి ఉన్న వైనం సంచలనంగా మారింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద ఉన్న హైవే రోడ్డు మీద పడి ఉన్న ఒక బస్తాలో కరెన్సీ నోట్లు గుట్టులు బయటకు వచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. హైవే మీద వెళ్లే వాహనం నుంచి కిందకు పడిన ఈ భారీ గోతాం మీద నుంచి లారీలు.. వాహనాలు వెళ్లటంతో సంచి చినిగిపోయింది.

దీంతో.. సంచిలో నుంచి కరెన్సీనోట్ల తుక్కు (అన్ని చిరిగిపోయినవి) గుట్టులుగా బయటకు వచ్చాయి. దీంతో.. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని.. వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంతకీ ఈ నోట్లు అసలా? నకిలీనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ అసలువైతే ఎందుకిలా తుక్కుగా మార్చారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

సాధారణంగా పాత నోట్లను ధ్వంసం చేసే సమయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది. అంతే కానీ.. వాటిని వేరే చోటుకు తరలించే అవకాశం ఉండదు. అయితే.. ఈ నోట్ల గుట్టలు అయితే బ్లాక్ మనీ అయినా అయి ఉండాలా? లేదంటే నకిలీవి అయినా అయి ఉండాలన్న వాదన వినిపిస్తోంది.

అయితే.. అసలు వీటిని తుక్కుగా ఎందుకు మార్చారు? ఎక్కడ మార్చారు? వీటిని ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తే.. విషయంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇంతకూ ఈ చిరిగిన నోట్ల తుక్కు సంచి.. ఏ లారీ నుంచి రోడ్డు మీద పడిందన్న విషయాన్ని సీసీ కెమేరాల ద్వారా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లారీ ఆచూకీ లభిస్తే.. విషయం ఇట్టే బయటకు వచ్చే వీలుంది.