Begin typing your search above and press return to search.

పోలీసులపై శునకాలని వదిలిన నిందితులు..ఎవరంటే

By:  Tupaki Desk   |   8 Oct 2021 12:41 PM GMT
పోలీసులపై శునకాలని వదిలిన నిందితులు..ఎవరంటే
X
ఓ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై శునకాలను ఉసిగొల్పి పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో నివసించే సయ్యద్‌ అహ్మద్‌ హుస్సేన్‌ జాఫ్రి ఇంట్లోకి ఈనెల 6న ఆరిఫ్‌ మొయినుద్దీన్‌తో పాటు దాదాపు 20 మంది ప్రవేశించి కర్రలు, రాడ్లతో దాడి చేశారు.

ఈ ఘటనలో సయ్యద్‌ సాజిద్‌, షేక్‌ సిరాజ్‌, మొహమ్మద్‌ ఆస్పాక్‌, షాజహాన్‌ తదితరులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన నిందితులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 86లోని ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ డీఐ మహ్మద్‌ హఫీజుద్దీన్‌, ఎస్సై కన్నెబోయిన ఉదయ్‌ తన సిబ్బందితో వెళ్లగా ఆరిఫ్‌, కుటుంబ సభ్యులు శునకాలను ఉసిగొల్పారు. పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర, మహిళా కానిస్టేబుళ్లు రవళిక, స్వాతిలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన నిందితులు అడ్డుకోవడమే కాకుండా మహిళా కానిస్టేబుళ్లతో అసభ్యంగా ప్రవరిస్తూ బయటకు నెట్టేశారు.

కత్తి చూపుతూ తాము గాయపరచుకుంటామని బెదిరించి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. లోపలి నుంచి చరవాణులు, మంచినీళ్ల సిసాలను పోలీసుల మీదకు విసిరారు. దీంతో స్వాతి, రవళికలు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం ఇంటి వెనుక ద్వారం నుంచి పారిపోయారు. వెంబడించిన పోలీసులు ప్రధాన నిందితుడు ఆరిఫ్‌తో పాటు అతనికి సహకరించిన జబీనా, షబానా బేగం లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. శునకాలను ఉసిగొల్పి విధులకు ఆటంకం కలిగించినందుకు డీఐ మహ్మద్‌ హఫీజుద్దీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.