Begin typing your search above and press return to search.

చిన్న తల తిరిగి రా!

By:  Tupaki Desk   |   26 Sep 2020 8:10 AM GMT
చిన్న తల తిరిగి రా!
X
ఐపీఎల్ లో మోస్ట్ ఫేవరెట్ జట్టు ఏదంటే అందరూ చెప్పే సమాధానం చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే ఆ జట్టు నడిపించేది అందరికీ ఇష్టమైన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. భారత క్రికెట్ కు ఎన్నో విజయాలు ఇచ్చిన ధోని అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే. అలాగే ఐపీఎల్లో చెన్నై జట్టుకు మూడు ట్రోఫీలు, లెక్కలేనన్ని విజయాలు అందించిన ధోనీ అంటే తమిళనాడు అభిమానులకు ఎంతో ఇష్టం. ధోనీని వాళ్ళు పెద్ద 'తల'గా సురేష్ రైనాను 'చిన్న తల'గా పిలుచుకుంటూ ఉంటారు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన రైనా ఐపీఎల్ లో చెన్నైకి అంతకంటే ఎక్కువ విజయాలు ఇచ్చాడు. కోహ్లీ గత ఏడాది ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. కానీ అప్పటి వరకు ఆ స్థానంలో రైనా కొన్నేళ్ల పాటు ఉన్నాడంటే అతడెన్ని విజయాలు అందించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.


రైనా ఐపీఎల్లో 5 వేలకు పైగా పరుగులు సాధించాడు. తాజాగా సీజన్లో మొదటి మ్యాచ్ గెలిచిన చెన్నై చివరి రెండు మ్యాచ్లు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ కు దూరమై రైనా ఇంటికి చేరడం తో చెన్నై జట్టు బ్యాటింగ్ లో చాలా బలహీనపడింది. ముఖ్యంగా ఆ జట్టు లో చివర్లో వచ్చి మంచి రన్ రేట్ తో ఫినిషింగ్ ఇచ్చే బ్యాట్స్ మెన్ రైనానే. అతడు లేకపోవడంతో జట్టులో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రుత్ రాజ్ గైక్వాడ్ విఫలం అవుతున్నాడు. మరో వైపు ఫామ్ లో ఉన్న రాయుడు దూరం అవడం, ఓపెనర్ గా ఉన్న మురళీ విజయ్ అన్ని మ్యాచుల్లోనూ సరిగ్గా ఆడక పోవడంతో చెన్నై బలహీనంగా కనిపిస్తోంది. సురేష్ రైనా తిరిగి జట్టులో చేరితే చెన్నై జట్టు గాడిన పడుతుందని అభిమానులు కోరుకుంటున్నారు. చెన్నై ఫ్యాన్స్, నెటిజన్లు అయితే 'చిన్న తల..తిరిగి రా' అంటూ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. అభిమానుల కోరిక మీదట చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సురేష్ రైనాతో చర్చలు జరిపి అతడిని జట్టులోకి తీసుకొని వస్తుందో లేదో చూడాలి. చెన్నై జట్టు యజమాని శ్రీనివాసన్ ఐపీఎల్ నుంచి సురేష్ రైనా నిష్క్రమించడంపై అతడిపై చాలా కోపంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని వారిద్దరూ ప్రకటించారు.