Begin typing your search above and press return to search.

అతన్ని 11వ ఆటగాడిగా పంపండి..జాదవ్ పై ట్రోల్స్

By:  Tupaki Desk   |   8 Oct 2020 11:53 PM GMT
అతన్ని 11వ ఆటగాడిగా పంపండి..జాదవ్ పై ట్రోల్స్
X
ఐపీఎల్లో భాగంగా బుధవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై పది పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఓటమికి కారణం కేదార్ జాదవ్ అని అభిమానులు మండిపడుతున్నారు. అతడిని టీమ్ నుంచి తొలగించాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యాన్ని కోరుతున్నారు. సోషల్ మీడియాలో జాదవ్ పై ట్రోల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అతడిని ఇంకా జట్టులో కొనసాగిస్తున్న కెప్టెన్ ఎంఎస్ ధోని పై కూడా అభిమానులు మండిపడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన జాదవ్ అన్ని మ్యాచ్ లలో కలిపి 58 పరుగులు మాత్రమే సాధించాడు. ముఖ్యంగా అతని జిడ్డు ఆటపై ఫాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇది టెస్ట్ మ్యాచ్ కాదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అతన్ని జట్టులో కొనసాగించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు.

బ్రేవో, జడేజా వంటి ఆటగాళ్లు ఉండగా అసలు ఫాంలో లేని జాదవ్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు ఎందుకు పంపిస్తున్నారని అడుగుతున్నారు. 'అతడిని పదకొండవ ఆటగాడిగా బ్యాటింగుకు దింపడమే మేలు' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతడికి ఫీల్డింగ్ చేయటం రాదు, బ్యాటింగ్ చేయలేడు, బౌలింగ్ అసలు వేయడం లేదు.. ఇక అతడిని జట్టులో ఎందుకు కొనసాగించాలంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. జాదవ్ ముఖ్యమైన సమయంలో 17 ఓవర్లలో 3 డాట్ బాల్స్ ఆడాడని, 20వ ఓవర్లలో 2 డాట్ బాల్స్ ఆడాడని అతడి వల్లే నైట్ రైడర్స్ తో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని నెటిజన్లు జాదవ్ కు వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడంతో పాటు మీమ్స్ కూడా పోస్టు చేస్తున్నారు.

మరికొందరు జాదవ్ తో పాటు ధోని బ్యాటింగ్ శైలి పై కూడా కామెంట్స్ చేశారు. ఓటమికి కారణమంటూ అందరూ జాదవ్ నే మాత్రమే విమర్శిస్తున్నారని.. అందుకు ధోని కూడా కారణమేనని కామెంట్ చేస్తున్నారు. అతడు కీలకమైన సమయంలో డాట్ బాల్స్ ఆడాడని విమర్శించారు. జాదవ్ కు ఐపీఎల్లో ఏమంత గొప్ప రికార్డ్స్ ఏమీ లేవు. ఇక అతడు టీమిండియాలో ఆటగాడు కూడా. టీమ్ ఇండియా తరఫున అతడు రికార్డులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఆరేళ్ల కిందటే జట్టులోకి వచ్చి ఇప్పటి వరకు 64 మ్యాచ్ లు ఆడి కేవలం 1242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో రెండు సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడో కెరీర్ ఆరంభంలో చేసిన సెంచరీలు తప్ప ఇటీవలికాలంలో అతడు రాణించింది ఏమీ లేదు. వరల్డ్ కప్ లో విఫలమైన తర్వాత ఇక అతడిని జట్టులోకి తీసుకోరని అందరూ భావించినా.. మళ్లీ అతడిని టీంలో కొనసాగిస్తున్నారు.