Begin typing your search above and press return to search.

సీన్లోకి వచ్చిన సీఎస్.. ఉద్యోగులకు వైఎస్ హయాం గురించి ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   4 Feb 2022 3:09 AM GMT
సీన్లోకి వచ్చిన సీఎస్.. ఉద్యోగులకు వైఎస్ హయాం గురించి ఏం చెప్పారంటే?
X
అనూహ్యంగా మొదలైన ఏపీ ఉద్యోగుల సమ్మెను ఏదోలా డీల్ చేయాలనుకున్న జగన్ ప్రభుత్వానికి.. ఊహించని ఎదురుదెబ్బ తగలటం తెలిసిందే. సమ్మె చేసినా.. ఏదో ఒక రోజు చర్చకు రావాల్సిందేగా అంటూ సింఫుల్ గా ఇష్యూను తేల్చేయటం.. అందుకు ప్రతిగా స్పందించిన ఉద్యోగులు.. ఈ నెలకు కొత్త జీతాల్ని ఆపి.. పాత జీతాల్ని ఇవ్వమని కోరటం తెలిసిందే. ఏమైనా సరే.. మా నోట్లో నుంచి వచ్చిందే ఫైనల్.. మీరు అడిగింది అధికారంలో ఉన్న మేం ఎందుకు ఇస్తామన్నట్లుగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

కలలో కూడా ఊహించని రీతిలో ప్రభుత్వ ఉద్యోగులు లక్షలాదిగా విజయవాడకు చేరుకోవటం.. అది కూడా జిల్లాల్లో దాదాపు రెండు లక్షల వరకు ఉద్యోగుల్ని పోలీసులతో అడ్డుకునేలా చేసిన తర్వాత ఇంత భారీగా ఉద్యోగులు బెజవాడకు చేరుకోవటం జగన్ సర్కారుకు చెమటలు పట్టేలా చేసిందని చెప్పాలి. జగన్ ప్రభుత్వానికి తమ సత్తా చాటాలన్న పట్టుదలను ప్రదర్శించిన ఏపీ ఉద్యోగులు.. గతంలో మరెప్పుడూ ప్రదర్శించినంత ఐకమత్యాన్ని ప్రదర్శించటం..ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారని చెప్పాలి.

గురువారం బెజవాడలో ఏపీ ఉద్యోగులు ప్రదర్శించిన నిరసన ర్యాలీకి వచ్చిన అనూహ్య స్పందన.. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని అమాంతం పెంచేస్తే.. అప్పటివరకు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్న జగన్ ప్రభుత్వం.. ఒక్కసారిగా నీరసించిపోవటమే కాదు.. ఇప్పటివరకు ఎప్పుడు లేని రీతిలో ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి. ఇలాంటి వేళ.. ఉద్యోగుల ఉత్సాహానికి బ్రేకులు వేస్తూ.. వారి సమరోత్సహానికి చెక్ పెట్టేందుకు వీలుగా రాజకీయ బలాన్ని ప్రదర్శించకుండా బుద్ది బలాన్ని బరిలోకి దించింది.

దీంతో.. మొన్నటివరకు పీఆర్సీ మీద వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలు.. ప్రభుత్వ సలహాదారులకు భిన్నంగా.. ఉద్యోగులందరికి పెద్ద బాస్ అయిన ఏపీ సీఎస్ (చీప్ సెక్రటరీ) సమీర్ శర్మసీన్లోకి వచ్చారు. ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే సమస్యలు ఎలా తీరుతాయంటూ ఆయన ప్రశ్నించిన తీరు చూస్తే.. ఎడవలేక నవ్విన రీతిలో ఉన్న పరిస్థితి. నిరసనలు.. ఆందోళనతో ఉపయోగం ఉండదని చెబుతూ.. ఉద్యోగులతో చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేసిన ఆయన.. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని చెప్పటం గమనార్హం.

నిజానికి ఉద్యోగులది సింగిల్ పాయింట్ ఎజెండా.ప్రభుత్వం తమకు కొత్త పీఆర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. పాత జీతాలు ఇస్తే.. అదే పదివేలుగా పేర్కొనటం తెలిసిందే. కానీ.. ఆ పాయింట్ ను ప్రస్తావించని సీఎస్ మాస్టారు.. ఇతర సాంకేతిక అంశాల్నిప్రస్తావించారే తప్పించి.. పాత జీతాలు ఇస్తే సరిపోతుందన్న సింగిల్ ఇష్యూను మాత్రం టచ్ చేయకుండా ఉండటం గమనార్హం. ఎప్పటిలానే కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10వేల కోటల్ భారం పడుతుందని.. కావాలంటే పే స్లిప్పులు చూసుకోవాలని కోరుతున్నారు.

నిజానికి సీఎస్ సమీర్ శర్మ అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు కోరుతున్నట్లుగా పాత జీతాల్నిఇస్తే.. ప్రభుత్వానికి రూ.10వేల కోట్ల అదనపు ఖర్చు తగ్గుతుంది కదా? అన్న సూటి ప్రశ్నకు సమాధానం చెప్పని పరిస్థితి. ఎవరికి జీతాలు తగ్గలేదని.. ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తుందని.. దాని వల్ల మూడు శాతం పెరుగుతుందని.. ఐఆర్ కలిపినా.. కలపకున్నా జీతం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇన్ని లెక్కలు దేనికి.. ప్రభుత్వానికి భారం మోపని రీతిలో పాత జీతాలు ఇమ్మన్నప్పుడు ఇస్తే సరిపోయే దానికి.. ఈ వాదన ఎందుకు? అన్నది అసలు ప్రశ్న. అయినప్పటికీ అర్థం చేసుకోనట్లుగా మాట్లాడుతున్న సీఎస్ మాటల్ని చూస్తే..ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెతో సర్కారు ఎంత ఇరుకున పడిందన్న విషయం ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.