వైసీపీ అధినేత - నవ్యాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన పాలనలో కొత్తదనం ఉంటుందని చాలా స్పష్టం గానే ప్రకటించారు. తాను తీసుకునే నిర్ణయాల ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, ఓ ఆరు నెలల వ్యవధిలోనే అది ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సంచలన ప్రకటన చేసిన విషయం గుర్తుంది కదా. జగన్ అందించే నయా పాలన ఎలా ఉంటుందన్న అంశంపై ఆరు నెలలు కూడా ఆగాల్సిన పనిలేదన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.
ఢిల్లీ టూర్ సందర్భంగా జగన్ అనుసరించిన వ్యూహమే ఈ మాటకు బలం చేకూరుస్తోంది. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ కంటే 60 సీట్లకు పైగా ఆధిక్యాన్ని సాధించిన జగన్... ఈ ఐదేళ్లు తనకు ఎదురే లేదన్నట్లుగా పాలించినా అడిగే నాథుడు లేడనే చెప్పాలి. అయితే బంపర్ మెజారిటీతో పొంగిపోని జగన్... ఏ విషయమైనా పాలనలో కీలక పాత్ర పోషించే అధికారులనే ఆయన ముందు నిలబెడుతున్నారు. ఢిల్లీ పర్యటనలో తన పార్టీ ఎంపీలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం - సీనియర్ ఐఏఎస్ అదికారి పీవీ రమేశ్ లను వెంటబెట్టుకుని వెళ్లిన జగన్... ప్రధాని మోదీతో భేటీలో వారినే ముందు పెట్టారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో కూడిన వినతిపత్రంతో పాటు జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరుతూ ఇచ్చిన ఆహ్వాన పత్రికకు కూడా జగన్.. ఎల్వీ చేతుల మీదుగానే మోదీకి అందజేశారు. ఇక ఆ తర్వాత ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ జగన్... ఓ వైపు ఎల్వీని - మరోవైపు పీవీ రమేశ్ ను కూర్చోబెట్టుకుని మరీ... తన పాలనలో అధికారులకు ఏ మేర పెద్ద పీట వేయనున్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ తరహా కొత్త పద్దతితో జగన్ పాలనలో తనదైన ముద్ర వేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.