Begin typing your search above and press return to search.

వామ్మో.. ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?

By:  Tupaki Desk   |   7 Dec 2021 7:50 AM GMT
వామ్మో.. ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?
X
ఏపీలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సంక్షేమ పథకాల మోత మోగించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు.. మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి పోవటం తెలిసిందే. దీంతో.. ఫ్రీ బీస్ తో ప్రజల్లో పెరిగిన పలుకుబడి కాస్తా రోడ్ల డ్యామేజ్ తో పోయింది. దీంతో.. మొన్నటివరకు సంక్షేమ పథకాల కోసం అర్రులు జాచిన వారంతా ఇప్పుడు.. అవి రాకున్నా ఫర్లేదు.. నడిచేందుకు రోడ్లు సరిగా లేకపోతే ఎలా? అన్న అంతర్మథనం మొదలైంది. ఇది సరిపోనట్లుగా.. ఇటీవల విరుచుకుపడిన వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల ప్రజల ఆగమాగం అయ్యే పరిస్థితి.

గతంలో.. భారీ వర్షం.. తుపాను హెచ్చరికలు వచ్చినంతనే.. సహాయక చర్యల మోతమోగించిన తీరుకు భిన్నంగా.. ఓవైపు పెద్ద ఎత్తున మనుషులు గల్లంతు అవుతున్నా.. పట్టని పరిస్థితి. సహాయక చర్యల విషయంలో చేతులు ఎత్తేసిన అధికార యంత్రాంగం తీరుకు మాట్లాడలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వర్షాలు..వరదలతో కిందా మీదా పడుతున్న బాధితులకు సహాయక చర్యలు అందించే విషయంలో సాగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇది సరిపోనట్లుగా.. వర్షాల కారణంగా.. జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అధికార యంత్రంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదని చెబుతున్నారు. ఇక.. గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికి మార్పురాలేదంటున్నారు.

మరి ముఖ్యంగా గ్రామాల్లో నిలిచిన వరద నీరు.. దానంతట అది పోవటమే తప్పించి.. ప్రత్యామ్నాయ పద్దతులతో వాటిని తొలగిస్తున్నది తక్కువగా ఉందంటున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపంగా కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏమిటి? అంటే.. మాగాణి పొలంగా అనుకునే అవకాశం ఉంది. కాకుంటే.. దాని పక్కన భవనం ఉండటంతోపొలం కాదని కొందరు అనుమానించొచ్చు. నిజమే.. అది మాగాణి పొలం కాదు.. ఆర్టీసీ బస్టాండ్. ప్రకాశం జిల్లా సీఎస్ పురం ఆర్టీసీ బస్టాండ్ బురదమయంగా మారింది.

ప్రతి రోజు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రజలు.. స్కూలుకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక.. బస్టాండ్ కు రావాలనుకునే వారి పరిస్థితి ఎలా ఉందో తాజా ఫోటోను చూస్తే.. అర్థమవుతుంది. ఇలాంటివి భారీ వర్షాలు.. వరదలతో ఉక్కిరిబిక్కిరి చేసిన నాలుగు జిల్లాల్లో చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఈ అవస్థల్ని ప్రజలకు తప్పించకుంటే.. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలు సంతోష పడరన్న వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికి గుర్తిస్తుందో?