Begin typing your search above and press return to search.

క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ తగ్గించడం లేదే?

By:  Tupaki Desk   |   21 Aug 2022 8:30 AM GMT
క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ తగ్గించడం లేదే?
X
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి, తగ్గడానికి అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. స్థిరంగా ఉన్నా మన పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వాల దోపిడీకి ఇవే ఆలవాలంగా మారుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో బ్యారెల్ ఒక్కంటికి 95.79 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 88.27 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. కొద్దిరోజులుగా బ్రెంట్ క్రూడ్ రేట్ 94-96 డార్ల మధ్య కదలాడుతోంది.

కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. అయినా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. బ్యారెల్ రేటు 70 డాలర్ల వరకూ క్షీణించవచ్చనే అంచనాలు వ్యక్తమైనప్పటికీ 85 డాలర్లకు దిగువకు కూడా చేరడం లేదు. ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాల్టీ కొత్త ధరలు చూస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కడా తగ్గించలేదని తెలుస్తోంది.

ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కంటికి రూ.96.72, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో అయితే ఏకంగా పెట్రోల్ లీటర్ ఒక్కంటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

కోల్ కతాలో పెట్రోల్ రూ.106.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ 101.94, డీజిల్ రూ.87.89గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ.109.66 పైసలు , డీజిల్ రూ.97.82 పైసలుగా నమోదైంది.

కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తున్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను కుదించాయి. మహారాష్ట్ర రెండు సార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రో ధరలపై వ్యాట్ ను తగ్గించడం లేదు. దీంతో క్రూడాయిల్ ధరలు తగ్గినా ప్రభుత్వాలు తగ్గించక సామాన్యుడికి ఊరట దక్కడం లేదు.