Begin typing your search above and press return to search.

కీలక దశకు జగన్ అక్రమాస్తుల కేసు..ఆగస్టు 3 నుండి ఆ మూడు కేసుల్లో .. !

By:  Tupaki Desk   |   27 July 2021 5:39 AM GMT
కీలక దశకు జగన్ అక్రమాస్తుల కేసు..ఆగస్టు 3 నుండి ఆ మూడు కేసుల్లో .. !
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు మాజీ మంత్రులు, అఖిలభారత సర్వీసు అధికారులు నిందితులుగా ఉన్న అక్రమాస్తుల కేసులని తేల్చేందుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీబీఐ కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీచేసింది. దీనితో సీఎం జగన్ సహా ఇతర నిందితులంతా తమ వాదనలతో సిద్ధం కావాలని . వీటితో పాటు పలువురు నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లనూ తేల్చేందుకు సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసుల వ్యవహారం త్వరలో ఓ కొలిక్కి రానుంది. ఈ కేసులో ఇప్పటికే పలు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిపై సీబీఐ కోర్టు తుది విచారణ ప్రారంభించడానికి సిద్ధం అవుతుంది.

దీనితో ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న వారంతా వాదనలకు సిద్ధం కావాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు వేగంగా విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సీబీఐ కోర్టు కూడా ఈ విషయంలో దూకుడు పెంచినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో భాగంగా సీబీఐ దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్లపై ముందుగా సీబీఐ కోర్టు విచారణ ప్రారంభించబోతోంది. ఇందులో అరబిందో, హెటిరో, లేపాక్షీ నాలెడ్జ్ హబ్, ఇందూ హౌసింగ్ ప్రాజెక్ట్ కేసుల ఛార్జిషీట్లు ఉన్నాయి. వీటిపై విచారణ ప్రారంభించేందుకు సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దీనితో ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారు తుది విచారణకు సిద్దం కావాల్సి ఉంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై వీరికున్న అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకురావాల్సి ఉంది. అరబిందో, హెటిరో, లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ హౌసింగ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై వాదనలకు సిద్ధం కావాలని జగన్ సహా ఇతర నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్ చంద్రారెడ్డి తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిలో కొందరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు.

మిగతా వారిపై యథావిథిగా సీబీఐ కోర్టు విచారణ సాగాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో సాగుతున్న జగన్ అక్రమాస్తు ల కేసు విచారణ ఆగస్టు 3కు వాయిదా పడింది. దీంతో ఆగస్టు 3 కల్లా వాదనలు సిద్ధం చేసుకోవాలని ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి, అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకున్న వారికీ సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే ఆగస్టు 3 నుంచి ఇక రెగ్యులర్ గా ఈ మూడు ఛార్జిషీట్లపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో జగన్ ఆస్తుల కేసులో దాఖలైన మొత్తం 11 ఛార్జిషీట్లలో మూడింటిలో విచారణ ప్రారంభం కాబోతుండటంతో త్వరలోనే మిగిలిన వాటిపై కూడా విచారణ ప్రారంభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అటు, ఈడీ కేసులను ముందు విచారించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. హైకోర్టు తీర్పు ఏమిటన్నది ఆసక్తి కలిగిస్తోంది.