Begin typing your search above and press return to search.

అరుదైన ఘటన.. బద్ధ శత్రువుకు రక్తదానం చేసిన ‘జవాన్లు’

By:  Tupaki Desk   |   30 May 2020 10:15 AM IST
అరుదైన ఘటన.. బద్ధ శత్రువుకు రక్తదానం చేసిన ‘జవాన్లు’
X
మీరేదో పొరపాటు పడి ఉంటారు? మావోలకు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్తదానం చేయటం ఏమిటి? వారు ఎదురుపడితే.. వారి రక్తం కళ్ల జూడాలని తపించే వారు ఇలా ఎందుకు చేస్తారు? అన్న సందేహం రాక మానదు. బద్ధ శత్రువులుగా.. ఒకరికి ఒకరు కంట కనపడితే చాలు.. చేతిలో తుపాకులకు పని చెప్పటమే కాదు.. ఎవరో ఒకరు చనిపోయే వరకూ వదిలి పెట్టని శత్రుత్వం ఇరు వర్గాల్లో ఉంది. అందుకు భిన్నంగా తాజాగా.. మానవత్వం వెల్లివిరియటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇంతకీ జరిగిందేమిటి? ఈ రేర్ సీన్ ఎలా సాధ్యమైందన్న విషయంలోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలో తాజాగా మావోలకు.. సీఆర్పీఎప్ జవాన్లకు మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతంలో ముగ్గురు మావోలను జవాన్లు ఎన్ కౌంటర్ చేయగా.. మరో ఇద్దరిని అరెస్టు చేశారు.అయితే.. ఆ ఇద్దరు మావోలకు తీవ్రమైన గాయాలు కావటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. రక్తం ఎక్కువగా పోయిందని.. వారికి రక్తాన్ని ఎక్కించటం చాలా అవసరమని తేల్చారు.

అప్పటికి రక్తం లేకపోవటంతో.. మావోల ప్రాణాల్ని కాపాడేందుకు ఇద్దరు జవాన్లు తమ రక్తాన్ని దానం చేయటానికి ముందుకు వచ్చారు. మావోలు తమకువ్యతిరేకంగా కాల్పులు జరిపేందుకు వీలుగా ట్రైనింగ్ ఇస్తారని తెలుసని.. వారి యుద్ధ తంత్రం ఎలా ఉంటుందో తెలుసని.. కానీ.. వాటన్నింటికి మించి మానవత్వం అన్నది ఒకటి ఉంటుంది కదా? అన్నది రక్తదానం చేసిన జవాను ప్రకాశ్ పేర్కొన్నారు.

దేశాన్ని రక్షించే కర్తవ్యంలో భాగంగా శత్రువు పై కాల్పులు జరుపుతామని.. అయితే వారి ప్రాణాల్ని కూడా తాము కాపాడతామని మరో జవాను చెప్పారు. ఏమైనా.. తమ శత్రువుని సైతం రక్షించేందుకు సీఆర్పీఎప్ జవాన్లు స్పందించిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.ఏమైనా ఇది అత్యంత అరుదైన ఘటనగా చెప్పక తప్పదు.