Begin typing your search above and press return to search.

బూట్లు తుడుస్తున్న జ‌వాన్‌...రియాక్ట‌యిన‌ పీఎంఓ

By:  Tupaki Desk   |   14 Jan 2017 6:29 AM GMT
బూట్లు తుడుస్తున్న జ‌వాన్‌...రియాక్ట‌యిన‌ పీఎంఓ
X
దేశరక్షణ కోసం అహరహం కాపలా కాసే జవాన్లు తమ కు సరఫరా చేస్తున్న ఆహారంపై, జీతభత్యాలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వారు తమ కష్టనష్టాలను వెళ్లగక్కుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా వారి స్థితిగతులు చర్చనీయాంశంగా మారాయి. సరిహద్దు భద్రతా దళంలో నాసిరకం ఆహారం సరఫరాపై జవాన్ తేజ్బహదూర్ యాదవ్ ఫేస్ బుక్‌ లో పెట్టిన పోస్టుపై ప్రధాని కార్యాలయం నజర్ వేసింది. దీనిపై హోంశాఖను మరింత సమాచారం కోరినట్టు తెలిసింది.

అధికారులు షూ పాలిష్ చేయించుకుంటున్నారని డెహ్రాడూన్‌ కు చెందిన 42 ఇన్పాంట్రీ బ్రిగేడ్ లాన్స్ నాయక్ యజ్ఞ ప్రతాప్ సింగ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. సైనికులతో అధికారులు వెట్టి చాకిరి - ఇంటిపనులు చేయించుకుంటున్నారని గతేడాది జూన్‌లో రక్షణశాఖ మంత్రి - ప్రధానమంత్రి - రాష్ట్రపతి - సుప్రీంకోర్టుకు లేఖ రాశానని పేర్కొన్నారు. తన లేఖపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) విచారణకు ఆదేశించిందని.. ఎప్పుడైతే పీఎంవో విచారణ మొదలైందో అప్పటినుంచి వేధింపుల పర్వం ఎక్కువైందని, తనను కోర్ట్ మార్షల్ చేశారని వాపోయారు. తాను ప్రధానికి రాసిన లేఖలో ఆర్మీకి సంబంధించిన నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. కాగా... బీఎస్ ఎఫ్ జవాన్ ఫేస్ బుక్ వీడియో హల్చల్ నడుస్తుండగానే సీఆర్పీఎఫ్‌ కు చెందిన మరో జవాన్ జీతభత్యాలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తూ యూట్యూబ్‌ లో వీడియో పోస్ట్ చేశాడు. తమకన్నా సైనికులకు - బడిపంతుళ్లకు ఎక్కువ జీతభత్యాలు ఇస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నాడు.

"ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మాకన్నా ఎక్కువ జీతాలిస్తున్నారు. మాకు మాత్రం సెలవులు లేవు, బెనిఫిట్లు లేవు" అంటూ కానిస్టేబుల్ జీత్ సింగ్ అందులో మొరపెట్టుకున్నాడు. నేను ప్రధానికి సందేశం పంపదల్చుకున్నాను అని వెల్లడించాడు.'సైన్యానికి - సీఆర్‌ పీఎఫ్‌ కు మధ్య జీతభత్యాల్లో చాలా వ్యత్యాసముంది. ఆ తేడా గమనిస్తే మీకే విస్మయం కలుగుతుంది. ఆర్మీకి పెన్షన్ ఉంది. మాకు లేదు. 20 ఏళ్ల‌ తర్వాత నేను రిటైర్ అయితే నా గతి ఏమిటి? అని చెప్పాడు. మాకు ఎక్స్ సర్వీస్‌ మెన్ కోటా లేదు. క్యాంటీన్ సేవలు లేవు.. వైద్య సేవలు అసలే లేవు. విధుల భారం మాత్రం మామీదే ఎక్కువ' అంటూ వాపోయాడు. జీత్ సింగ్ వీడియో పాతదేనని అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఐజీ స్థాయి అధికారి ఒకరు అతనితో మాట్లాడుతున్నారని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కే దుర్గాప్రసాద్ అన్నారు. ఉత్తర‌ప్ర‌దేశ్ లోని మథురలో జీత్సింగ్ తల్లి తన కుమారుడు చేసిన ఆరోపణలను సమర్థించారు. భారత ప్రభుత్వానికి కష్టాలు చెప్పుకోవడం క్రమశిక్షణారాహిత్యమేమీ కాదు అని జీత్సింగ్ సోదరుడు అన్నారు.

ఇదిలాఉండ‌గా...రెండు వీడియోలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. పరిస్థితిని అంచనా వేసే పని ఈ సరికే మొదలుపెట్టాం. అన్నీ పరిశీలిస్తున్నాం. వార్తల ఆధారంగా కొన్ని సూచనలు వచ్చాయి. వాటిని అమలు చేస్తున్నాం అని రిజిజు చెప్పారు. ఆర్మీ జవాన్లకు సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల గురించి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని రక్షణమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. బీఎస్ఎఫ్ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, దాని గురించి ఎక్కువగా మాట్లాడబోనని అన్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/