Begin typing your search above and press return to search.

బంగ్లా..భారత్ లలో మరో అర్థరాత్రి స్వాతంత్ర్యం

By:  Tupaki Desk   |   2 Aug 2015 5:03 AM GMT
బంగ్లా..భారత్ లలో మరో అర్థరాత్రి స్వాతంత్ర్యం
X
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాలుగా తాము ఏ దేశానికి చెందిన వాళ్లమో అర్థం కాక జుత్తు పీక్కునే వేలాది మందికి శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత సరికొత్తగా స్వాతంత్ర్యం వచ్చేసింది. భారత్.. బంగ్లాదేశ్ మధ్య ఈ మధ్య కుదిరిన సరిహద్దుల సెటిల్ మెంట్ల పుణ్యమా అని తాజా పరిణామం చోటు చేసుకుంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. కొన్నాళ్లకే పాక్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ గా ఏర్పడటం.. దానికి సంబంధించిన సరిహద్దు గొడవ నెలకొనటం తెలిసిందే. అయితే.. ఇరు దేశాలకు చెందని ప్రాంతంగా పేర్కొంటున్న దానిపై ఉన్న వివాదం కారణంగా వేలాది మంది అటు బంగ్లాదేశ్ కు.. ఇటు భారత్ కు కాకుండా పోవటం తెలిసిందే.

ఈ అంశంపై సుదీర్ఘకాలంగా పరిష్కారం కోసం ప్రయత్నాలు సాగుతున్న మోడీ సర్కారు తీసుకున్న చొరవతో.. రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీంతో.. ఇప్పటివరకూ భారత్ కు చెందిన 162 భూభాగాలకు చెందిన 17,160 ఎకరాలు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి బంగ్లాదేశ పరం కాగా.. అదే సమయంలో.. బంగ్లాదేశ్ కు చెందిన 111 ప్రాంతాలకు చెందిన 7,110 ఎకరాల్ని భారత్ కు అప్పగించింది.

దీంతో.. బంగ్లా ఇచ్చిన ప్రాంతాల్లోని 14వేల మంది భారత పౌరులుగా మారితే.. భారత్ ఇచ్చిన 17,160 ఎకరాల్లోని 37 వేల మంది బంగ్లా పౌరులుగా మారిపోయారు. దీంతో.. ఇంతకాలం దేశం లేని వారిగా ముద్ర పడిన ప్రజలకు రెండు దేశాలు దొరికిన పరిస్థితి.

తాజాగా బంగ్లాదేశ్ కు భారత్ అప్పగించిన ప్రాంతాలన్నీ పశ్చిమ బెంగాల్ పరిధిలోనివే. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా.. శుక్రవారం అర్థరాత్రి దాటినవెంటనే.. కూచ్ బెహార్ లోని మధ్య మసల్ దంగాలోని ప్రజలు.. వీధుల్లోకి వచ్చి త్రివర్ణ పతాకంతో వీధుల్లో హంగామా చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించిన వారు.. స్వాతంత్య్ర వేడుకల్ని నిర్వహించారు.

భారత్ కు 1947 ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. తాము ఈ రోజునే భారత్ పౌరులు అయినందున.. తమకిది రెండో స్వాతంత్ర్య దినోత్సవంగా వారు పేర్కొంటున్నారు. ఇక.. దేశాలు మారే విషయంలో ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యే 51 వేల మందికి.. రెండుదేశాల వారు ఛాయిస్ లు ఇచ్చారు. వారు కోరుకున్న విధంగా.. వారి దేశాల్ని నిర్ణయించారు.