Begin typing your search above and press return to search.

నిజామాబాద్ స‌భ‌లోనూ లెక్క ఫెయిల్‌?

By:  Tupaki Desk   |   4 Oct 2018 4:54 AM GMT
నిజామాబాద్ స‌భ‌లోనూ లెక్క ఫెయిల్‌?
X
అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు ఆ ధీమానే వేరుగా ఉంటుంది. ప్ర‌స్తుతం అలాంటి మూడ్‌ లోనే ఉన్నారు కేసీఆర్‌. తాను గెలుస్తాన‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల కంటే కూడా కేసీఆర్ కు ఉండ‌టం చాలా అవ‌స‌రంగా చెప్పాలి. త‌న గెలుపు మీద త‌న‌కే న‌మ్మ‌కం లేని స్థితిలో కేసీఆర్ ఉంటే.. అంత‌కుమించిన ఫెయిల్యూర్ మ‌రొక‌టి ఉండ‌దు. కోట్లాది మందిని క‌దిలించే స‌త్తా ఉన్న కేసీఆర్.. త‌న గెలుపు మీద త‌న‌కు న‌మ్మ‌కం లేక‌పోతే ఇంకేం ఉంటుంది?

గెలుపు ధీమా ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో వేసుకున్న అంచ‌నాలు అదే ప‌నిగా తేడా కొట్ట‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ మ‌ధ్య‌న నిర్వ‌హించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సు సంద‌ర్భంగా రికార్డు స్థాయిలో జ‌న‌స‌మీక‌ర‌ణ గురించిన కేసీఆర్ మాట‌లు మొద‌టిసారి తేడా కొట్టేలా జ‌రిగింది.

తాజాగా నిర్వ‌హించిన నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లోనూ జ‌న‌సమీక‌ర‌ణ లెక్క తేడా జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ స‌భ‌కు 2 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా జ‌న‌సమీక‌ర‌ణ చేస్తున్న‌ట్లుగా చెప్పారు. ల‌క్ష కూడా దాట‌ని స‌భాస్థ‌లి కెపాసిటీకి రెట్టింపుగా జ‌న స‌మీక‌ర‌ణ ఖాయ‌మ‌ని భావించారు. అందుకు త‌గ్గ‌ట్లే ఏర్పాట్లు చేశారు. ల‌క్ష‌కు మించి జ‌న‌స‌మీక‌ర‌ణ చేప‌డితే.. నిజామాబాద్ ప‌ట్ట‌ణ‌మంతా జ‌నంతో నిండిపోయేలా చేయొచ్చ‌ని భావించారు. అయితే.. అనుకోని రీతిలో జ‌న స‌మీక‌ర‌ణ విష‌యంలో గులాబీ నేత‌లు మ‌రోసారి త‌ప్ప‌ట‌డుగులు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

గెలుపు మీద కేసీఆర్ ఎలాంటి కాన్ఫిడెన్స్ తో ఉన్నారో.. స‌భ‌ల‌కు జ‌నం త‌ర‌లి వ‌చ్చే విష‌యంలోనూ గులాబీ నేత‌లు అంతే న‌మ్మ‌కంతోనూ.. ఆత్మ‌విశ్వాసంతోనే ఉన్నారు. ఇదే.. వారి కొంప ముంచుతోంద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు జ‌న స‌మీక‌ర‌ణ తాము ఒక్క‌ళ్లం చేయ‌క‌పోతే ఏం పెద్ద తేడా రాద‌న్న భావ‌న ప‌లువురు గులాబీ నేత‌ల్లో క‌ల‌గటం.. అంతిమంగా ఏదో జ‌రిగిపోతుంద‌న్న అంచ‌నాల‌కు భిన్నంగా జ‌నం వ‌స్తుండ‌టం ఇప్పుడు మ‌రోసారి రుజువైన‌ట్లు చెప్పాలి.

ప‌క్కా ప్లానింగ్ తో భారీ స‌క్సెస్ సాధించాల‌ని.. త‌ద్వారా విప‌క్షాల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో పడేలా చేయాల‌న్న కేసీఆర్ అండ్ కో ప్లానింగ్ వ‌ర్క్ వుట్ కాలేద‌ని చెబుతున్నారు. 2 ల‌క్ష‌ల మందిని స‌భ‌కు రానున్నారంటూ కేసీఆర్ బ‌డాయి మాట‌లు చెప్ప‌టం.. అందుకు తగ్గ‌ట్లుగా ప‌ని జ‌ర‌గ‌క‌పోవ‌ట‌తో ల‌క్ష కంటే త‌క్కువ‌గానే జ‌నం వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

అయితే.. కెమేరా ఫ్రేమ్ కు స‌రిగా ఫిట్ అయ్యేలా సెట్ చేసుకొని తీసే ఫోటోలు పేప‌ర్ల‌లోనూ.. టీవీ ఛాన‌ళ్ల‌లోనూ జోరుగా చూపించినంత‌నే కేసీఆర్ కోరుకున్న‌ట్లు రెండు ల‌క్ష‌ల మందిని స‌మీక‌రించే విష‌యంలో గులాబీ ద‌ళం మ‌రోసారి ఫెయిల్ అయిన‌ట్లుగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

టైట్ ఫ్రేంలో భారీగా జ‌నం వ‌చ్చిన‌ట్లు క‌నిపించినా.. అంకెల్లోచూస్తే మాత్రం ల‌క్ష దాట లేదంటున్నారు. మాట‌లు ఆర్భాటంగా ఉంటే స‌రిపోదు.. చేత‌ల్లోనూ అదే జోరు క‌నిపించాల‌న్న విష‌యాన్ని గులాబీ అధినేత ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు.