Begin typing your search above and press return to search.

ఇద్దరు బ్యాంకు మేనేజర్లు.. కారు డ్రైవర్ భారీ ప్లానింగ్.. రూ.2కోట్లు కొట్టేశారు

By:  Tupaki Desk   |   20 March 2021 8:30 AM GMT
ఇద్దరు బ్యాంకు మేనేజర్లు.. కారు డ్రైవర్ భారీ ప్లానింగ్.. రూ.2కోట్లు కొట్టేశారు
X
అవును.. బ్యాంకుకు రక్షకుడిగా ఉండాల్సిన ఇద్దరు మేనేజర్లు.. ఒక కారు డ్రైవర్ ఉమ్మడిగా వేసిన మాస్టర్ ప్లాన్ ఒక భారీ మోసానికి తెర తీసింది. ఫోర్జరీ సంతకాలు.. నకిలీ పాసుపుస్తకాల్ని తయారు చేసి మరీ చేసిన ఈ మోసం ఇప్పుడు సంచలనంగా మారింది. కాసుల కక్కుర్తితో చేసిన ఈ పని తాజాగా బయటకు వచ్చి సంచలనం కావటమే కాదు.. మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ మోసం వివరాల్లోకి వెళితే..

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ భారీ మోసం చోటు చేసుకుంది. గతంలో ఇద్దరు మేనేజర్లుగా పని చేసిన అధికారులు చేసిన ఈ తప్పుడు పనిని.. తాజాగా మేనేజర్ గా వచ్చిన అధికారి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. 2016 నుంచి 2019 వరకు బ్యాంకు మేనేజర్ కు కారు డ్రైవర్ గా పని చేశాడు ప్రభాకర్. పంట రుణాలు తీసుకోవటానికి ఏ పత్రాలు అవసరమన్న విషయంపై పట్టు సాధించాడు. తప్పుడు పత్రాల్ని తయారు చేశాడు. అదే సమయంలో ముత్తారం.. రామగిరి మండలాల్లో తనకు తెలిసిన వారికి పంట రుణాల్ని ఇప్పిస్తామని చెప్పి.. అప్పులు తీసుకోండి.. కొంతకాలానికి ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందని చెప్పారు.

దీంతో.. 153 మందికి ఇలా అప్పులు ఇప్పించి.. ఒక్కొక్కరి దగ్గర కొంత మొత్తాన్ని వసూలు చేశాడు. అలా చేసిన మొత్తంలో ఒక్కో ఫైలుకు రూ.5వేలచొప్పున కమిషన్ ఇస్తానని వారిని ఒప్పించాడు. ఇతగాడి ప్రపోజల్ కు అప్పట్లో బ్యాంకు మేనేజర్లుగా పని చేసిన రామానుజాచార్య.. వెంటేశ్వర్లుతో బేరం కుదుర్చుకున్నాడు. అలా కోట్ల రూపాయిల మోసానికి పాల్పడ్డారు. ఇటీవల బ్యాంకుమేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రేమానంద్ ఈ స్కాంను గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.