Begin typing your search above and press return to search.

జడ ఉంటేనే కాలేజీలోకి.. సెల్ఫీలపై నిషేధం

By:  Tupaki Desk   |   23 Aug 2021 11:30 PM GMT
జడ ఉంటేనే కాలేజీలోకి.. సెల్ఫీలపై నిషేధం
X
బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో ఉన్న సుందరావతి మహిళా మహా విద్యాలయం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జడ వేసుకుంటేనే విద్యార్థినులను విద్యాలయంలోకి అనుమతిస్తామని ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పెనుదుమారం రేపుతోంది.

కళశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకొని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఏడాది ఇంటర్ లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ను కూడా నిర్ధేశించింది. దీంతోపాటు విద్యార్థినీలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అమ్మాయిలు ఎవరైనా సరే కాలేజీలోకి లూజ్ హెయిర్ తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించబోమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామన్ సిన్హా తేల్చిచెప్పడం పెను వివాదంగా మారింది. కళాశాల కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది.

సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అనే మూడు విభాగాలున్న ఈ కాలేజీలో ప్రస్తుతం 1500 మంది అమ్మాయిలున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ కొత్త డ్రెస్ కోడ్ ను నిర్ణయించడానికి ఓ కమిటీ వేశారు. అందులో ఉన్న సభ్యులు సూచించిన దుస్తులనే ధరించాలని కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ ఆదేశాలను ఎవరైనా సరే అతిక్రమించి డ్రెస్ కోడ్ లేకుండా.. జడ వేసుకోకుండా వచ్చే వారికి ప్రవేశం లేదని స్పష్టం చేసింది.