Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొన్న పుట్ బాల్ లెజెండ్

By:  Tupaki Desk   |   3 Aug 2020 5:00 PM GMT
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొన్న పుట్ బాల్ లెజెండ్
X
ఒక ఖరీదైన కారు విలువ ఎంత ఉంటుంది? రూ.5 కోట్లు.. రూ.10 కోట్లు? అన్న మాట చాలామంది నోట వస్తుంది. కాస్త ఆలోచించి చెప్పొచ్చుగా అంటే.. అతి కష్టమ్మీదా రూ. 20 కోట్ల మాట వస్తుంది. అంతకు మించి ఆలోచించేందుకు సైతం మనసు ఒప్పుకోదు. ఆ వెంటనే గూగులమ్మను ఇదే ప్రశ్నను సంధిస్తే.. మొన్నటి వరకూ మరోలా చెప్పేదేమో కానీ.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రపంచ ప్రఖ్యాత పుట్ బాల్ క్రీడా ప్రముఖుడు క్రిస్టియానో రొనాల్డో కొనుగోలు చేసిన కారు గురించి చెప్పటం ఖాయం.

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. అసలు ఒక కారు ధర ఇంత భారీగా ఉంటుందా? అన్న భావన కలిగేలా దీని రేటు ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాటీ కారును కొనుగోలు చేసిన అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంతకీ దీని ధర గురించి చెప్పలేదు కదా. మన రూపాయిల్లో చెప్పాలంటే జస్ట్ రూ.75 కోట్లు మాత్రమేనట. ఏంది? రూ.75 కోట్లా? అని నోరు వెళ్లబెట్టమాకండి. ఇంకా చాలానే సర్ ప్రైజ్ లు ఉన్నాయి మరి.

ఈ మోడల్ కారు ప్రపంచంలో కేవలం పది మాత్రమే తయారుచేశారట. దీని విలువ దగ్గర దగ్గర 8.5 మిలియన్ యూరోలుగా చెబుతున్నారు. పొడవాటి పడవలా ఉన్న కారు ముందు.. చిన్నసైజు బాక్సర్ వేసుకొని విలాసంగా ఫోజు ఇచ్చిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అతగాడు ఇంత ఖరీదైన కారును కొనటానికి కారణం ఏమిటో తెలుసా? ఇటీవల జరిగిన ఫుట్ బాల్ టోర్నీలో ఇటాలియన్ జట్టు జువెంటస్ తరఫున బరిలోకి దిగిన రొనాల్డో.. తన జట్టు పాత్రలో కీలక భూమిక పోషించాడు. దీంతో.. ఆ జట్టు 36వ సారి ఛాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తనకు తాను ఈ ఖరీదైన కారును గిప్టు ఇచ్చుకున్నాడు.

ఖరీదైన కార్లు రోనాల్డో వద్ద చాలానే ఉన్నాయని చెబుతారు. ఖరీదైన బుగట్టి కంపెనీకి చెందిన మూడు మోడళ్లు ఇప్పటికే ఆ సెలబ్రిటీ వద్ద ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కారులో 8 లీటర్ల డబ్ల్యూ 16 ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 1600 బీహెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. కేవలం 2.3సెకన్ల వ్యవధిలో ఈ కారను గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఇంతకూ ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 380 కి.మీ. గా చెబుతున్నారు. రోనాల్డోనా మజాకానా?