Begin typing your search above and press return to search.

చట్టసభల్లో నేరచరితులు: తాజా - మాజీలపై 4442 కేసులు

By:  Tupaki Desk   |   10 Sep 2020 5:15 AM GMT
చట్టసభల్లో నేరచరితులు: తాజా - మాజీలపై 4442 కేసులు
X
దేశ రాజకీయాల్లోకి నేరస్థులు ప్రవేశిస్తున్నారు. వారే ప్రజాప్రతినిధులుగా మారి ప్రజలను పాలిస్తున్నారు. దేశంతో పలువురు తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే రాజకీయంలో నేరచరిత్ర ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు .

నేరగాళ్లు ఎన్నికలలో పోటీ చేయడం వల్ల వారి ప్రభావం ఎన్నికలకే పరిమితం కావటం లేదు. పాలనపైనా పడుతోంది. దేశ రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశించడంతో, చేరటంతో ప్రజలకు సాంఘిక, ఆర్థిక న్యాయం జరగడం లేదు. దేశంలో తాజా - మాజీ ఎంపీలు - ఎమ్మెల్యేలపై మొత్తం 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సుప్రీంకోర్టు వివిధ హైకోర్టుల నుంచి అందిన నివేదికల్లో తెలిపింది. వీరిలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై 2,556 కేసులు ఉన్నట్టు వెల్లడించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. అమలు కావడం లేదంటూ హక్కుల ఉద్యమ నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ప్రత్యేక కోర్టులతో సహా వివిధ కోర్టులలో సిట్టింగ్, మాజీ ఎంపీలు/ఎమ్మెల్యేలపై మొత్తం 4,442 కేసులు పెండింగ్‌లో ఉండడం.. వీటిలో 2,556 కేసులు సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై ఉండడంతో కొంత సీరియస్‌ అయింది. యావజ్జీవ శిక్షార్హమైన తీవ్ర నేరాలకు సంబంధించి 413 కేసులు కూడా ఉన్నాయి. 174 కేసుల్లో సిట్టింగ్ ఎంపీలు/ఎమ్మెల్యేలు నిందితులుగా తేలారు. ఇందులో ఎక్కువగా యూపీకి చెందిన 35 మంది సిట్టింగ్‌లు తీవ్ర నేరాలలో నిందితులుగా ఉన్నారు. తర్వాతి స్థానంలో బీహార్ (30) - కర్ణాటక (27) - మహారాష్ట్ర (17) ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా కేసుల్లో తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిపై ఇప్పటి వరకూ చార్జిషీట్‌ కూడా దాఖలు కాలేదట. యూపీలోని ఎంపీలు/ఎమ్మెల్యేలపై అత్యధికంగా 446 - కేరళలో 310 కేసులు ఉన్నాయి.

ఇక, తెలుగు రాష్ట్రాల్లో తాజా - మాజీ ఎంపీలు - ఎమ్మెల్యేలపై 263 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని సీనియర్‌‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిలో ఏపీలో 145 - తెలంగాణలో 118 కేసులు నడుస్తున్నాయని - అత్యధికంగా సిట్టింగ్‌ ఎంపీ - ఎమ్మెల్యేలపైనే ఉన్నాయని వివరించారు.

ఏపీలో పెండింగ్‌ లో ఉన్న 85 కేసుల్లో సిట్టింగ్‌ ఎంపీలు - ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. అధికారులు జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన వీరిపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద నమోదైన కేసుల్లో 21 మంది ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. వీరిపై నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

తెలంగాణలోని ఓ సిట్టింగ్‌ ప్రజాప్రతినిధిపై యావజ్జీవ శిక్ష పడే స్థాయి కేసు ఒకటి ఉందన్నారు. తెలంగాణలో నమోదైన 118 కేసుల్లో 107 కేసుల్లో సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. ఇవన్నీ హైదరాబాద్‌ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ - కర్ణాటక - మధ్యప్రదేశ్‌ - తమిళనాడు - పశ్చిమబెంగాల్‌ లలో ఈ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన కోర్టుల్లో కేసులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.