Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: అభ్యర్థుల్లో నేర చరిత్ర ఇంతనా? ఏ పార్టీలో ఎక్కువంటే?

By:  Tupaki Desk   |   6 March 2022 4:49 AM GMT
ఐదు రాష్ట్రాల ఎన్నికలు: అభ్యర్థుల్లో నేర చరిత్ర ఇంతనా? ఏ పార్టీలో ఎక్కువంటే?
X
నిత్యం నీతులు చెబుతూనే.. వాటిని ఏ మాత్రం పాటించని వారి విషయంలో రాజకీయ పార్టీలు ముందుంటాయి. ప్రజల జీవితాల్ని మార్చేందుకు.. వారు బతుకుల్ని తీర్చి దిద్దేందుకు తాము పోరాడుతున్నట్లుగా ప్రతి పార్టీ చెబుతూనే ఉంటుంది. అలాంటి పార్టీలకు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులతో అవసరం ఏమిటి? అన్న ప్రశ్నతో చూసినప్పుడే.. వారి మాటల్లోని నేతిబీరలో నేతి చందం ఇట్టే అర్థమైపోతుంది.

ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు తుదిదశకు చేరుకున్నాయి. సోమవారం యూపీలో జరిగే చివరి దశ పోలింగ్ తో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుంది. అనంతరం మూడు రోజులకు (మార్చి 10న) ఓట్ల లెక్కింపు ఉంటుంది.

అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారాన్ని చేపడుతుందన్న విషయం మీద క్లారిటీ వచ్చేయటమే కాదు.. జాతీయ రాజకీయ పరిణామాల మీద ప్రభావం ఏమిటన్నది ఇట్టే అర్థం కావటం ఖాయం. పలు సమీకరణాలను మార్చే శక్తి ఈ ఎన్నికల ఫలితాలకు ఉందన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఎన్నికలు పూర్తయ్యే వేళ.. ఒక ఆసక్తికర డేటా బయటకు విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన ఒక మదింపు చేశారు. మొత్తం అభ్యర్థుల్లో 70 మంది మినహా మిగిలిన అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి..విశ్లేషించామన్నారు.

దీనికి సంబంధించిన వివరాల్ని చూసినప్పుడు షాక్ కు గురి కాక తప్పదు. ఎందుకంటే.. మొత్తం అభ్యర్థుల్లో 25 శాతం మంది నేర చరితలు ఉంటే.. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు.

ఐదు రాష్ట్రాలకు సంబంధించి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు.. వారు దాఖలు చేసిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత ఈ నివేదికను సిద్ధం చేసింది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ. మొత్తం అభ్యర్థుల్లో (6944 మంది అభ్యర్థుల్లో) 1694 మంది అంటే 25 శాతం మంది అభ్యర్థులకు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో 1262 మంది అంటే.. 18 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులుగా గుర్తించారు.

మొత్తం 6874 మంది అభ్యర్థుల్లో 1916 మంది జాతీయ పార్టీలకు చెందిన వారు కాగా.. 1421 మంది ప్రాంతీయ పార్టీలకు.. 1829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు కావటం గమనార్హం. 1708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. నేర చరిత ఉన్న 1694 మంది అభ్యర్థుల్లో తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న వారు 1262 మంది తెలిసిందే. ఈ కేసుల్లో హత్య.. హత్యాయత్నం.. మహిళలపై నేరాలకు పాల్పడిన వారు ఉండటం గమనార్హం.

మరింత లోతుల్లోకి వెళితే నేర చరిత్ర ఉన్న పార్టీల్లో జాతీయ పార్టీల అభ్యర్థుల్లో 34 శాతం మంది నేర చరిత్ర ఉన్న వారు ఉంటే.. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న వారి సంఖ్య 24 శాతంగా ఉన్నారు. ఇక.. ప్రాంతీయ పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల్లో 39 శాతం మంది ఉంటే.. 29 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న వారున్నారు.

గుర్తింపు లేని పార్టీల అభ్యర్థుల్లో నేర చరిత్ర 14 శాతం ఉంటే.. 11 శాతం మందిలో తీవ్రమైన నేరారోపణలు ఉన్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారిలోనూ నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు 13 శాతమైతే.. తీవ్రమైన నేరారోపణ ఉన్న వారు 11 శాతం మంది ఉన్నట్లుగా గుర్తించారు.

అభ్యర్థుల్ని రాష్ట్రాల వారీగా తీసుకుంటే.. యూపీ బరిలో ఉన్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు 26 శాతమైతే.. వీరిలో 20 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. గోవాలోనూ ఇదే పరిస్థితి. 26 శాతం మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. 18 శాతం తీవ్రమైన నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఉన్నారు.

పంజాబ్ లో నేరచిత్ర ఉన్న అభ్యర్థులు 25 శాతమైతే.. తీవ్రమైన నేరచరిత ఉన్న వారు 17 శాతం.. ఈ మూడు రాష్ట్రాలతో పోలిస్తే.. మణిపూర్.. ఉత్తరాఖండ్ అభ్యర్థుల్లో నేర చరిత్ర ఉన్న వారు తక్కువ. మణిపూర్ లో 20 శాతం.. ఉత్తరాఖండ్ లో 17 శాతం మంది అభ్యర్థులు నేరచరిత్ర ఉంటే.. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న వారు మణిపూర్ లో 15 శాతం మంది.. ఉత్తరాఖండ్ లో 10 శాతం మంది ఉన్నట్లుగా గుర్తించారు.

నేర చరిత్ర ఎక్కువగా ఉన్న అభ్యర్థుల్ని బరిలోకి దించిన క్రెడిట్ అకాలీదళ్ అభ్యర్థులదే. ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 68 శాతం మందికి నేర చరిత్ర ఉంటే.. 63 శాతం మందికి తీవ్రమైన క్రిమినల్ నేరారోపణల్ని ఎదుర్కొంటున్నారు. తర్వాతి స్థానంలో సమాజ్ వాదీ పార్టీ ఉంది.

మూడో స్థానంలో ఆర్ ఎల్ డీ.. నాలుగో స్థానంలో బీజేపీ ఉంటే.. కాంగ్రెస్ ఆరో స్థానంలో ఉంది. నీతితో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థుల్లో నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు 25 శాతమైతే.. తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న వారు 16 శాతం మంది ఉండటం గమనార్హం.

పార్టీల వారీగా నేర చరిత్ర.. తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న అభ్యర్థుల శాతాల్ని చూస్తే..

రాజకీయ పార్టీ పేరు నేర చరిత్ర తీవ్రమైన క్రిమినల్ కేసులున్నోళ్లు
అకాలీదళ్ 68% 63%
సమాజ్ వాదీ 56% 41%
ఆర్ఎల్ డీ 51% 46%
బీజేపీ 38% 28%
బీఎస్పీ 35% 27%
కాంగ్రెస్ 34% 22%
ఆమ్ఆద్మీ 25% 16%
ఇండిపెండెంట్లు 13% 11%