చంద్రబాబుకు షాక్.. క్రిమినల్ కేసు నమోదు!

Fri May 07 2021 18:00:01 GMT+0530 (IST)

criminal cases have been registered against Nara Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు సమాచారం. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు శుక్రవారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. కరోనా మహమ్మారి ఉధృతంగా కొనసాగుతున్న వేళ.. అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను భయాందోళనకు గురిచేశారనే అభియోగం కారణంగా ఆయనపై కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి.కర్నూలులో ప్రమాదకర కొవిడ్ మ్యుటెంట్ ఎన్-440కే వైరస్ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారని దీనివల్ల ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారని సుబ్బయ్య ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం మీడియా ముఖంగా బాబు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రజలను భయపెట్టినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఈ మేరకు పోలీసులు 155 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్‌బెయిలబుల్ కేసు కూడా రిజిస్టర్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. కాగా..ఏపీలో ఇలాంటి వైరస్ ఏదీ లేదని ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని దీనికి చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ప్రధాన కారణంగా మారాయని అంటున్నారు.