Begin typing your search above and press return to search.

క్రికెటర్ శ్రీశాంత్ గెలవలేదు సరి కదా..

By:  Tupaki Desk   |   19 May 2016 9:48 AM GMT
క్రికెటర్ శ్రీశాంత్ గెలవలేదు సరి కదా..
X
‘‘కేరళలో అధికారంలోకి రాబోయేది భారతీయ జనతా పార్టీనే. నమ్మండి.. మా పార్టీ 70 స్థానాలు సాధించబోతోంది’’.. కేరళలో ఎన్నికలు పూర్తయ్యాక క్రికెటర్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలివి. భాజపా ఈసారి లేక లేక కేరళలో ఖాతా తెరిచే అవకాశాలు మాత్రం ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా.. శ్రీశాంత్ మాత్రం ప్రతి మీడియా సంస్థతోనూ ఇదే మాట అన్నాడు.

ఐతే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే భాజపా ఒక్క సీటు గెలిచి తన ఉనికిని చాటుకుంది. శ్రీశాంత్ చెప్పిన 70 సీట్ల లెక్క కామెడీగా మారిపోయింది. చివరికి శ్రీశాంత్ సైతం గెలవలేకపోయాడు. తాను పోటీ చేసిన తిరువనంతపురం నియోజకవర్గంలో అతను మూడో స్థానానికి పరిమితమయ్యాడు. అతడికి 34 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అసలు శ్రీశాంత్ కు ఈ మాత్రం ఓట్లు రావడం కూడా గొప్పే అనే వాళ్లున్నారు. శ్రీశాంత్ కు భాజపా టికెట్ ఇవ్వడం చూసే చాలా మంది ఆశ్చర్యపోయారు అప్పట్లో.

కేరళ తరఫున టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన అతి కొద్దిమంది క్రికెటర్లలో ఒకడైన శ్రీశాంత్.. 2007 టీ20 ప్రపంచకప్.. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడు కావడం విశేషం. ఓ దశలో ఓ వెలుగు వెలిగిన శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జైలుపాలయ్యాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఐతే ఫిక్సింగ్ నేరాలకు శిక్ష విధించడానికి సరైన చట్టాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి బయటపడ్డా.. శ్రీశాంత్ మీద పడ్డ మచ్చ చెరిగిపోలేదు. అతను క్రికెట్ కు పూర్తిగా దూరమైపోయి.. సినిమాలు - రాజకీయాల మీద దృష్టిపెట్టాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరినా.. అతడికి మంచి రాజకీయాల్లో మంచి ఆరంభం దక్కలేదు.