Begin typing your search above and press return to search.

జ‌నం సొమ్ము సింగ‌పూర్ సోకులపాలు

By:  Tupaki Desk   |   8 Oct 2018 9:25 AM GMT
జ‌నం సొమ్ము సింగ‌పూర్ సోకులపాలు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావతిలో సింగ‌పూర్ ప్రైవేట్‌ కంపెనీల కన్సార్టియంకు ప్ర‌భుత్వం స్టార్టప్‌ ఏరియా క‌ట్ట‌బెట్టిన వ్యవహారం ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఈ ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి తొలిద‌శ‌లో భాగంగా రూ.350 కోట్లు విడుద‌ల చేయాలంటూ ఆర్థిక శాఖ‌కు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌ డీఏ) ప్ర‌తిపాద‌న‌లు పంప‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన‌ కార‌ణం. ఈ ప్రాజెక్టు వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాపై ఎలాంటి భారం ప‌డ‌బోద‌ని.. ఆ ప్రాంత అభివృద్ధిపై అన్ని ఖ‌ర్చుల‌నూ సింగ‌పూర్ క‌న్సార్టియ‌మే చూసుకుంటుంద‌ని తొలుత ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా సీఆర్‌డీఏ నిధులు కోరుతుండ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దే ప్ర‌ణాళిక‌లో భాగమంటూ.. న‌గ‌రంలో 1,691 ఎక‌రాల భూమిని సింగ‌పూర్ ప్రైవేటు కంపెనీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. ఇక్క‌డ రోడ్లు - విద్యుత్ - మంచినీటి సరఫరా - మురుగు నీటి పారుదల వంటి మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి రూ.5,500 ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచనా వేసింది. వాస్త‌వానికి ఆ ఖ‌ర్చును రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తొలుత అంగీక‌రించారు. అయితే, దీనిపై ప‌లు వ‌ర్గాల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ్యక్త‌మ‌య్యాయి. రూ.వేల కోట్లు ఖ‌ర్చు చేసి మ‌రీ ప్ర‌భుత్వ భూముల‌ను విదేశీ సంస్థ‌ల‌కు ధ‌రాద‌త్తం చేయ‌డ‌మెందుక‌ని ప‌లువ‌రు నిల‌దీశారు. ప్ర‌భుత్వ‌మే ఆ భూముల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించి.. వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించొచ్చు క‌దా అని ప్ర‌శ్నించారు. లేదా ప్ర‌భుత్వ‌మే స్వ‌యంగా ప్లాట్లు వేసి విక్ర‌యిస్తే మంచి లాభాలుంటాయ‌ని సూచించారు. సింగ‌పూర్ సంస్థ‌ల‌కు ఇచ్చే భారీ రాయితీలు ప్ర‌భుత్వ ఖ‌జానాకు గుదిబండ‌గా మారే అవ‌కాశ‌ముంద‌ని గ‌తంలో ఆర్థిక‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ క‌ల్లాం వంటి వారు కూడా హెచ్చ‌రించారు.

అన్నివ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో అప్ప‌ట్లో ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఆపై సింగపూర్‌–అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ అనే సంస్థ తెరపైకి వచ్చింది. సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీల బదులు ఈ సంస్థే రాయితీ, షేర్‌ హోల్డర్స్‌ ఒప్పందాలు చేసుకుంటుందని సీఆర్‌ డీఏ వెల్ల‌డించింది. మౌలిక వ‌స‌తుల అభివృద్ధిని సైతం ఆ సంస్థే చూసుకుంటుంద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాపై ఎలాంటి భారం ప‌డ‌బోద‌ని స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాతే భూముల అప్ప‌గింత వ్య‌వ‌హారం ముగిసింది. అయితే, ఒప్పందంలోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా.. స్టార్ట‌ప్ ఏరియాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం రూ.350 కోట్లు ఇవ్వాలంటూ ఆర్థిక‌శాఖ‌ను సీఆర్‌ డీఏ కోర‌డం ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఆర్థిక శాఖ‌పై ఏమాత్రం భారం ఉండ‌బోద‌ని గ‌తంలో హామీ ఇచ్చి ఇప్పుడు మ‌ళ్లీ కాసులు కావాల‌ని అడ‌గ‌డ‌మేంట‌ని ఆర్థిక‌శాఖ అధికారులు కూడా ప్ర‌శ్నించారు. అస‌లు సింగ‌పూర్ సంస్థ‌ల‌తో చేసుకున్న ఒప్పంద ప‌త్రాల‌ను త‌మ‌కు పంపాల‌ని సీఆర్‌డీఏను ఆదేశించారు. మ‌రి ఆ ఒప్పందం ప‌త్రాల్లో ఏముంది? ప‌్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేయ‌క త‌ప్ప‌దా? అనే విష‌యాలు ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.