Begin typing your search above and press return to search.

రాజ‌ధానిలో ఘోరం.. పంటకాల్వ‌ల పూడిక‌!

By:  Tupaki Desk   |   28 Sep 2017 6:40 AM GMT
రాజ‌ధానిలో ఘోరం.. పంటకాల్వ‌ల పూడిక‌!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అధికారులు రైతుల నోళ్ల‌లో మ‌ట్టికొట్టారు. సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు ఉన్నాయో? లేక వారే సొంతంగా నిర్ణ‌యాలు తీసేసుకున్నారో తెలియ‌దు కానీ.. సీఆర్‌డీఏ అధికారులు రైతుల క‌ళ్ల‌లో ర‌క్త క‌న్నీరు తెప్పించారు. వారు క‌న్న‌బిడ్డ‌ల్లా సాకుతున్న పొలాల‌కు వెళ్తున్న నీటి మార్గాల‌ను చెప్పా పెట్ట‌కుండా పూడ్చి పారేశారు. దీంతో రైతులు... తమ పొట్ట కొట్టారంటూ రోడ్డెక్కారు. విష‌యంలోకి వెళ్తే.. రాజధాని ప్రాంతంలో రైతుల జోలికి వెళ్లబోమని, పంట కాలువలను పూడ్చబోమని గతంలో గుంటూరు కలెక్టర్‌ న్యాయస్థానానికి విన్నవించారు.

అయితే, రోజులు గ‌డిచేస‌రికి అధికారులు మారిపోయారు. కోర్టుకు ఇచ్చిన విన్న‌పాన్ని సైతం తుంగ‌లో తొక్కారు. రైతులు ఎంతో వ్య‌వ‌ప్ర‌యాస‌లు ఓర్చుకుని సాగు చేస్తున్న పంట‌లకు ప్ర‌వ‌హిస్తున్న నీటిని ఆపేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌ డీఏ) అధికారులు రైతుల పొలాల‌పై ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు. ఏకంగా పంటకాలువలను పూడ్చేసే పని పెట్టుకున్నారు. భారీ ప్రొక్లెయినర్‌లతో వచ్చి పంటకాలువలను పూడుస్తుండటంతో రైతులు ల‌బోదిబోమ‌న్నా ఏ ఒక్క అధికారీ ప‌ట్టించుకోలేదు.

నిజానికి రాజ‌ధాని రైతుల‌కు ఈ ఖ‌రీఫ్ స‌హా ర‌బీ వ‌ర‌కు అనుమ‌తి ఉంది. పోనీ కోర్టు ఆదేశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా.. ఈ ఖ‌రీఫ్ పంట‌ల‌కు పూర్తిగా ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందే. అయితే, అనూహ్యంగా సీఆర్ డీఏ అధికారులు బుధ‌వారం మందీ మార్బ‌లంతో - ప్రొక్లెయిన్ల‌తో విరుచుకుప‌డి.. పొలాల‌కు నీళ్లు ప్ర‌వ‌హిస్తున్న కాల్వ‌ల‌ను పూడ్చేశారు. దీంతో తాము క‌ష్ట‌ప‌డి సాగు చేసుకుంటున్న పంట‌లు ఎండిపోతాయ‌ని రైతులు ఆందోళ‌న‌కుదిగారు. వీరి ఆందోళ‌న‌కు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మ‌ద్ద‌తు ప‌లికారు.

కోర్టుకు చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు పంటకాలువలను పూడ్చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఇలా పంటకాలువలను పూడ్చడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, దీనిపై కోర్టుకు వెళుతామని ఆయ‌న‌ స్పష్టం చేశారు. అయినా కూడా అధికారులు ఎక్క‌డా జంకు గొంకు లేకుండా త‌మ‌ప‌ని కానిచ్చేయ‌డంతో ఇదేనా రైతు ప్ర‌భుత్వం అంటూ అన్న‌దాత‌లు క‌న్నీటి ప‌ర్యంత‌మై బాబు ప్ర‌భుత్వానికి శాప‌నార్థాలు పెట్టారు. ఇక‌, ఈ విష‌యంలో సీఎం ఆజ్ఞ‌లు లేకుండా తాము ఎలా ముందుకు వెళ్తామ‌ని ఓ అధికారి ఆఫ్‌ది రికార్డుగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబు కు కోర్టుల‌న్నా లెక్క‌లేదా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.