Begin typing your search above and press return to search.

పదో నంబరు జెర్సీ .. భలే క్రేజీ

By:  Tupaki Desk   |   2 Dec 2021 10:09 AM GMT
పదో నంబరు జెర్సీ .. భలే క్రేజీ
X
జెర్సీలందు ఆ జెర్సీ వేరయా? ఆ జెర్సీ వేసుకున్నందుకు వారు దిగ్గజాలయ్యారా? వారు దిగ్గజాలైనందుకు ఆ జెర్సీకి ప్రాధాన్యం ఏర్పండిందా? అంటే ఏదీ కచ్చితంగా చెప్పలేం. ఇంతకూ ఆ జెర్సీ నంబరు ఏదంటే.. ‘‘10’’. ఒక్క క్రికెట్‌లోనే కాదు.. ఫుట్‌బాల్‌లోనూ నెంబర్‌ 10వ నంబరు జెర్సీ బాగా క్రేజీ. ఫుట్‌బాల్‌ దిగ్గజాలుగా పేరు పొందిన పీలే, మారడోనా, జినదిన్‌ జిదానే, రొనాల్డీనో, డెల్పోరో, వెయిన్‌ రూనీ, మెస్సీ లాంటి స్టార్స్‌ ధరించేది కూడా ఇదే జెర్సీ. ఈ నంబరు ధరిస్తే స్టార్‌ హోదా వస్తుందని చాలా మంది నమ్మకం. ఇక క్రికెట్‌లో నెంబర్‌ 10 జెర్సీ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది టీమిండియా లెజెండరీ సచిన్‌ టెండూల్కర్‌. తన కెరీర్‌లో ఎక్కువకాలం ఈ జెర్సీతోనే ఆడిన సచిన్‌ ఎన్నోమైలురాళ్లను అందుకున్నాడు.

అందరూ క్లిక్ అయ్యారా?

పదో నంబరు జెర్సీ ధరించిన వారంతా కెరీర్ లో దిగ్విజయం అయ్యారా? అంటే అదేమీ లేదు. అసలు సచిన్ కెరీర్ 10వ నంబరు జెర్సీతో ప్రారంభమే కాలేదు . టీమిండియాలోకి వచ్చని కొత్తలో అతడు ధరించింది 99వ నంబరు జెర్సీ. తర్వాత 33వ నంబరు జెర్సీ తో ఆడాడు. చివరగా 10వ నంబరు జెర్సీకి మారాడు. అయితే, దీంతోనే సచిన్‌ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. క్రికెట్‌ చరిత్రలో వంద సెంచరీలు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు, వన్డే క్రికెట్‌లో అ‍త్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. క్రికెట్ లో ఇతర 10వ నంబరు జెర్సీదారులెవరూ అంతగా రాణించలేదు. 1997-2007 కాలంలో న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రెయిగ్‌ మెక్‌మిలన్‌ మంచి బ్యాటర్‌గానే మిగిలిపోయాడు. 55 టెస్టుల్లో 3116 పరుగులు.. 197 వన్డేల్లో 4707 పరుగులు సాధించాడు. 8 టి20ల్లో ఆడిన మెక్‌మిలన్‌ 187 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అలెన్‌ డొనాల్డ్‌ జెర్సీ నెంబర్‌ 10. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా డొనాల్డ్‌ చరిత్ర సృష్టించాడు. ఒక ఓవరాల్‌గా 72 టెస్టులాడిన అలెన్‌ డొనాల్డ్‌ 330 వికెట్లతో సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 164 వన్డేల్లో 272 వికెట్లు తీసిన డొనాల్డ్‌ రిటైర్మెంట్‌ తర్వాత అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు.. చాలా ప్రైవేట్‌ లీగ్‌ల్లో కోచ్‌గా వ్యవహరించాడు.

ఫేమ్ అయింది ఆఫ్రిది ఒక్కడే?

ఆసియా నుంచి చూస్తే క్రికెట్‌లో సచిన్‌ తర్వాత జెర్సీ నెంబర్ 10తో ఫేమస్‌ అయిన ఆటగాడు షాహిద్‌ అఫ్రిది మాత్రమే. పాకిస్తాన్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన అఫ్రిది వన్డే చరిత్రలో 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ రికార్డు 17 ఏళ్లు నిలిచింది. వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ అఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్‌ తరపున అఫ్రిది 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు, 99 టి20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు. కాగా 1996లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన డారెన్‌ లీమన్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారడానికి ఐదేళ్లు పట్టింది. లీమన్‌ 2004-05 కాలంలో 10వ నెంబర్‌ జెర్సీ ధరించి ఆడాడు. ఆస్ట్రలియా తరపున 117 వన్డేల్లో 3078 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాకు ప్రధాన కోచ్‌గా సేవలందించిన లీమన్‌ 2018 నాటి బాల్‌టాంపరింగ్‌ ఉదంతం తర్వాత పదవి నుంచి వైదొలిగాడు.

దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది ధరించిన 10వ నెంబర్‌ జెర్సీని ధరించడం సంతోషంగా ఉందంటూ షాహిన్‌ అఫ్రిది ట్వీట్‌ చేయడం వైరల్‌గా మారింది. అయితే క్రికెట్‌లో అడుగుపెట్టిన మొదట్లో 40వ నెంబర్‌ జెర్సీతో బరిలోకి దిగిన షాహిన్‌ ఆ తర్వాత 10వ నెంబర్‌ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకబౌలర్‌గా మారిన షాహిన్‌ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ సెమీస్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.