Begin typing your search above and press return to search.

బయటపడిన సీపీఎం డబల్ గేమ్

By:  Tupaki Desk   |   14 Dec 2021 10:31 AM GMT
బయటపడిన సీపీఎం డబల్ గేమ్
X
సీపీఎం నేతల వైఖరి విచిత్రంగా ఉంది. రాజధాని విషయంలో ఎందుకు సీపీఎం డబల్ గేమ్ ఆడుతోందో అర్ధం కావటంలేదు. ఒకవైపు ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ కు మద్దతుగా నిలబడింది. ఇదే సమయంలో రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్లకు మద్దతుగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. రాయలసీమ ప్రాజసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో సీపీఎం డబల్ గేమ్ బయటపడింది.

ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండ్ తో న్యాయస్ధానం టు దేవస్ధానం కార్యక్రమంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ తో పాటు సీపీఎం నేతలు కూడా మద్దతుగా పాల్గొంటున్నారు. ఈనెల 17వ తేదీన తిరుపతిలో బహిరంగసభ నిర్వహించాలని జేఏసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటం కోసం పై పార్టీల నేతలంతా కలిసి పనిచేస్తున్నారు.

ఇదే సమయంలో రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ, కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు. హంద్రీ-నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు-నగిరి ప్రాజెక్టులకు చట్టబద్దత కల్పించాలని, కర్నూలులో వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతు వేదిక డిమాండ్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

వెంటనే మధు మాటలకు వేదిక నేతలు అభ్యంతరం చెప్పారు. ఒకవైపు ఏకైక రాజధానిగా అమరావతికి మద్దతిచ్చి, పాయాత్రలో పాల్గొంటున్న సీపీఎం మళ్ళీ రాయలసీమ వేదిక డిమాండ్లకు మద్దతు ప్రకటించటం ఏమిటంటు మధును నిలదీశారు. దీంతో వీళ్ళకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాక మధు అక్కడి నుండి వెళ్ళిపోయారు. నిజానికి సీపీఎం డబల్ గేమ్ ఆడాల్సిన అవసరమే లేదు. అమరావతా ? లేకపోతే మూడు రాజధానులా ? అనే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

ఒకవైపు అమరావతి జేఏసీకి మద్దతిస్తునే మరోవైపు రాయలసీమ హక్కుల వేదిక డిమాండ్లకు మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది. అసలు సీపీఎం డబల్ గేమ్ ఎందుకాడుతోందో అర్ధం కావటంలేదు. అమరావతే ఏకైక రాజధానిగా ఉన్నా మూడు రాజధానులున్నా సీపీఎం వచ్చేది లేదు పోయేది లేదు. ఎందుకంటే ఆ పార్టీని జనాలెవరు అసలు పట్టించుకోవటమే మానేశారు. ఏదో మీడియాలో వార్తల కోసం మాత్రమే వామపక్షాలు పనిచేస్తున్నాయంతే. ఇంతోటిదానికి మళ్ళీ డబల్ గేమ్ ఒకటి.