Begin typing your search above and press return to search.

మంచి పనులు వెంకయ్య చెవికెక్కుతాయా?

By:  Tupaki Desk   |   3 Oct 2016 4:38 AM GMT
మంచి పనులు వెంకయ్య చెవికెక్కుతాయా?
X
ఢిల్లీ సర్కారు నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక్క రూపాయి వచ్చినా సరే.. తాను ఢిల్లీలో చెమటోడ్చి - నెత్తురు చిందిస్తేనే.. రాష్ట్రానికి అది మంజూరైనదంటూ డబ్బా కొట్టుకోవడం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు చెడ్డ దురలవాటు అయిపోయింది. కేంందనుంచి మామూలు పంపకాల్లో భాగంగా రాష్ట్రానికి దక్కుతున్న ప్రతి రూపాయిని కూడా ఆయన తన కృషి ఖాతాలో రాసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా సరే గానీ.. వాస్తవంగా రాష్ట్రఅభివృద్ధికి దారితీయగల - రాష్ట్ర వనరుల్ని సమర్థంగా వినియోగించడానికి కారణం కాగల ఓ పరిశ్రమ విషయంలో ఆయన అదే శ్రద్ద చూపి, తీసుకురాగలరా అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఈ విషయంలో వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి గనుక.. చెవిన వేసుకోవడానికి ఆయన మనస్సాక్షి ఒప్పుకోదేమో అని కూడా కొందరంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. సముద్ర తీరంలో చమురుశుద్ధి కర్మాగారం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది వస్తే చాలా పెద్ద అభివృద్ధి ప్రాతిపదిక అవుతుంది. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. కేంద్రం తీరంలో పెట్టదలచుకున్న చమురుశుద్ధి కర్మాగారం అటు తమిళనాడుకో - ఇటు ఒరిస్సాకో తరలిపోకుండా - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రభుత్వాలు సాధించుకు రావాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేస్తున్నారు. కాకినాడ వద్ద చమురు బావులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ శుద్ధి కర్మాగారం కూడా మన రాష్ట్రంలోనే పెడితే.. సబబుగా ఉంటుంది. కాకపోతే అంత మంచి ప్రాజెక్టును కేంద్రంనుంచి సాధించుకు రావడానికి ఎవరు శ్రద్ధ చూపిస్తారు.

కేంద్రం తన అడ్మినిస్ట్రేషన్‌ మరియు వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రానికి కొన్ని వివిధ సంస్థలను విదిలిస్తోంటే.. అవన్నీ తాను చెమట చిందించి సాధించినవిగా వెంకయ్య చెప్పుకుంటున్నారు. అలాంటి వెంకయ్య నిజంగా రాష్ట్రం మీద శ్రద్ద - కేంద్రంలో ఇన్‌ ఫ్లుయెన్స్‌ చేసేంత నాయకుడు అయితే గనుక.. ఈ చమురు శుద్ధి కర్మాగారాన్ని సాధించుకు రావాలని జనం కోరుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/