Begin typing your search above and press return to search.

మోసపోయిన ఏపీ... ఇప్పుడే తెలిసిందా జైట్లీ?

By:  Tupaki Desk   |   8 Sept 2016 10:05 AM IST
మోసపోయిన ఏపీ... ఇప్పుడే తెలిసిందా జైట్లీ?
X
బుధవారం అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్, అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనువాదం చూసిన తర్వాత చాలామందికి "అంతన్నాడు, ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్లో ముంచేశాడే గంగరాజు" అనే ఒక తెలుగు సినిమాపాట గుర్తుకురాకమానదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ప్రజలకున్న ఆశలు అన్నీ ఇన్నీ కాదు. రాష్ట్ర విభజన సమయంలోనే వారంతా ఆ విషయంలో ఫిక్సయి పోయారు. ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే.. "ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది.. మేము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా అమలుచేస్తాం" అని మోడీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి వాటిని నివృత్తి చేశారు. దీంతో "ఏపీకి హోదా ఫిక్స్" అని ప్రజలు ఫిక్సయిపోయారు.

అయితే బుధవారం అర్ధరాత్రి జరిగిన మద్దెల దరువులో భాగంగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన - ఇస్తున్నామన్న ప్యాకేజీ అసలు ప్యాకేజీయే కాదని కొట్టిపారేస్తున్నారు సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ. కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ను వంచించిందని - బడ్జెట్ లోటుని ఎవరు పూర్తి చేస్తారో వివరణే లేని ఆ విషయాలు - ప్రకటనల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు - కొండ ప్రాంతాలకే ప్రత్యేక హోదా ఇస్తారన్న విషయం అరుణ్ జైట్లీకి ఇప్పుడు తెలిసిందా అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రస్థావించినప్పుడు, ఎన్నికల సమయంలో వాగ్ధానాలు చేస్తున్నపుడూ ఈ విషయం తెలియనంత అజ్ఞానంలో వున్నారా అని నిలదీశారు. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని రామకృష్ణ అన్నారు.

ఆంధ్రప్రదే రాష్ట్రంపై కేంద్రం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని వ్యాఖ్యానించారు.