Begin typing your search above and press return to search.

సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:26 AM GMT
సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..!
X
ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్ల వ్యవహారం చివరి అంకానికి చేరుకున్నట్లు అనిపిస్తోంది. గతేడాది ఏప్రిల్ లో టికెట్ ధరలను నియంత్రిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈరోజు గురువారం మరికొందరు సినీ ప్రముఖులు తీసుకొని మరోసారి భేటీ కానున్నారు.

అయితే గత నెలలో చిరంజీవి ఒక్కరే జగన్ తో మీటింగ్ కి వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు కూడా ఫిలిం ఛాంబర్ - ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ - 'మా' అసోసియేషన్ తరపున కాకుండా.. కొందరిని తీసుకుని సీఎం జగన్‌‌ తో సమావేశానికి వెళ్తుండటంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నారాయణ మాట్లాతుడుతూ.. ''సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై గతంలోనే చిరంజీవి వెళ్లి మాట్లాడి రావడం వివాదం అయింది. వాస్తవానికి ఫిలిం ఛాంబర్ - నిర్మాతల మండలికి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మరికొందరిని తీసుకొని వెళ్తున్నారు. 'మా' సంస్థ - ఛాంబర్ ల ద్వారా వెళ్తే ఇలాంటివి పరిష్కారం అవుతుందే తప్ప.. ఈ పద్ధతిలో వెళ్లి విభజించు పాలించు అనే విధానం కరెక్ట్ కాదు'' అని అన్నారు.

''ఇప్పటికే ఉద్యోగుల సమస్యల్లోనూ ప్రభుత్వం విభజించు పాలించు విధానాన్ని అనుసరించి పరిష్కారం మమ అనిపించారు. అది ఇంకా రావణాసుర కాష్ఠంలాగే మండుతానే ఉంది. ఉద్యోగుల సమస్యల్లాగే సినీ పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం మేనేజ్‌ చేయాలని చూస్తోందనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండాలే తప్ప.. ఈ విధంగా మేనేజ్‌ చేయాలనే చూస్తే మాత్రం సినీ పరిశ్రమలో సంక్షోభం వస్తుంది'' అని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.

గతంలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి - చిరంజీవి సమావేశంపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఒంటరిగా ముఖ్యమంత్రిని కలవడం ఆయన చేసిన పొరపాటని అన్నారు. చిరంజీవి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇప్పుడు నారాయణ మరోసారి దీనిపై స్పందించారు.