Begin typing your search above and press return to search.

పవన్ పై సీపీఐ నారాయణ పంచ్ లు

By:  Tupaki Desk   |   4 Sept 2015 4:42 PM IST
పవన్ పై సీపీఐ నారాయణ పంచ్ లు
X
ఎవరినైనా సరే ఘాటుగా విమర్శించే సీపీఐ నేత నారాయణ నోటికి పాపం పవన్ కళ్యాణ్ చిక్కారు. ప్రశ్నిస్తానని బీరాలు పలకడం.. అప్పుడప్పుడు అర్థంపర్థం లేకుండా ప్రశ్నించడం మాత్రమే తెలిసిన పవన్ ను ఇప్పటికే పలు ఇతర పార్టీల నేతలు విమర్శించినా సీపీఐ నారాయణలా మాత్రం తేలిగ్గా తీసిపారేసినట్లు మాట్లాడినవారులేరు. తాజాగా నారాయణ మాట్లాడుతూ పవన్ ను ఏకంగా పాలిటిక్స్ లో ఎక్స్ట్రా ప్లేయర్ అంటూ కొట్టిపడేశారు. అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే ఆటలో అరటిపండన్న మాట.

అంతేకాదు.... కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నేతలకు పంచెలు తడుస్తున్నాయంటూ ఆ రెండు పార్టీల నేతలకూ వాతలు పెట్టారు. కర్నూలు లో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు క‌లిసిపోరాడాల‌ని హిత‌వుప‌లికారు.

అయితే.... పవన్ ను నారాయణ అంతమాటనేసరికి ఆయన అభిమానులు సీరియస్సవుతున్నారు. దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న సీపీఐ ఇప్పటికే ఆటలో అరటిపండేనని... మొన్నమొన్నే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ మొన్నటి ఎన్నికల్లో ఎంతటి కీలక పాత్ర పోషించారో తెలిసి కూడా నారాయణ అలాంటి మాటలు ఎలా అంటారని వారు వాదిస్తున్నారు. అంతేకాదు.... మోడీ అంతటివాడే పవన్ కు ప్రాధాన్యమిస్తుంటే నారాయణ మాటలను ఎవరు పట్టించుకుంటారు అంటూ కొట్టిపడేస్తున్నారు.

కాగా పేదల కోసం ప్రశ్నిస్తానంటున్న పవన్ తో పేదల పార్టీ సీపీఐ కలిసి పన్చేయడం మానేసి ఇలా పంచ్ లు వేయడం ఏమిటో అంటున్నారు మరికొందరు. రాజధాని భూసేకరణ విషయంలో పవన్ కనీసం మాట్లాడుతున్నాడని... సీపీఐ, ఆ పార్టీ నేత నారాయణ ఆ పని కూడా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా నారాయణ పంచ్ మాత్రం బాగానే పేలింది.