Begin typing your search above and press return to search.

సీపీఐ నారాయణ సంచలనం..వైట్ హౌస్ ముందు నిరసన!

By:  Tupaki Desk   |   31 Aug 2019 3:20 PM GMT
సీపీఐ నారాయణ సంచలనం..వైట్ హౌస్ ముందు నిరసన!
X
దేశంలోని కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నేతల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణది ప్రత్యేక శైలేనని చెప్పక తప్పదు. లెఫ్ట్ పార్టీల నేతలు నిత్యం ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తుంటే... ఓ కమ్యూనిస్టు నేతగా నారాయణ కూడా అదే తరహా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే సదరు నిరసనల్లో నారాయణ ఓ ప్రత్యేక శైలిని అవలంబిస్తున్నారని చెప్పక తప్పదు. తనదైన ప్రత్యేక శైలితో నిత్యం వార్తల్లో నిలిచే నారాయణ... ఇప్పుడు తన నిరసనలను ఆయన ఏకంగా దేశాన్ని దాటించి అంతర్జాతీయ స్థాయికి చేర్చేశారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నారాయణ ఆ దేశ అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ ముందు నిరసన తెలిపి నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. భారత్ - పాకిస్థాన్ ల మధ్య నలుగుతున్న కాశ్మీర్ అంశాన్ని తీసుకున్న నారాయణ... ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న వైఖరిని నిరసనగా వైట్ హౌస్ ముందు నిరసనకు దిగారు. కశ్మీర్‌ అంశంపై అమెరికా అనుసరిస్తున్న విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు వర్గాలు వాషింగ్టన్‌ లోని వైట్‌ హౌస్‌ ముందు నిరసనలు తెలియజేస్తున్నాయి.

ఈ నిరసనల్లో నారాయణ కూడా పాల్గొని గొంతు కలిపారు. మానవ హక్కులు ట్రంప్‌ సొంతం కాదని - కశ్మీర్‌ లో మారణకాండ ఆపాలని - దీనికి యుద్ధం పరిష్కారం కాదని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కశ్మీర్‌ కు తగిన పరిష్కారం చూపి న్యాయం చేయాలని కోరారు. అగ్రరాజ్యం అమెరికాలోనే వైట్‌ హౌస్‌ కు కొద్దిదూరంలో నిరసన తెలియజేస్తే నేరం కాదని - కానీ ఏపీ - తెలంగాణల్లో ముఖ్యమంత్రుల నివాసాలకు 10 కిలోమీటర్ల దూరంలో నిరసన తెలిపినా నేరమేనని కూడా నారాయణ తనదైన శైలి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.