Begin typing your search above and press return to search.

సీఎంవి...నీకు తెలీదా బాబు

By:  Tupaki Desk   |   17 March 2015 12:58 PM GMT
సీఎంవి...నీకు తెలీదా బాబు
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఏంటో ఏపీ సీఎం చంద్రబాబుకు ఇపుడు అర్థం అవుతోంది. తెలంగాణలో జరిగే ప్రతి చర్య ఏపీపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉద్యోగులకు జరిగే జీతభత్యాల పెంపు తదితర అంశాలు రభసగా మారుతున్నాయి. దాదాపు 33 శాతం ఫిట్‌మెంట్‌ కు ఉద్యోగులను ఒప్పిద్దామని బాబు ఆశపడ్డప్పటికీ అది కుదరలేదు. తెలంగాణ లాగే 43శాతం ఇవ్వాల్సి వచ్చింది. ఇపుడు తెలంగాణలో అంగన్‌వాడీ జీతాలు పెరగడం మళ్లీ బాబు మెడకు చుట్టుకుంది. తమకు వేతనాలు పెంచాలని మంగళవారం హైదరాబాద్‌లో అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. దీనిపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున రగడ జరిగింది.

అంగన్‌వాడీల జీతభత్యాల పెంపుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చి వారి పక్షాన ఉన్నామని మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసింది. అయితే దీనిపై చంద్రబాబు స్పందించిన తీరు ఆయన స్థాయికి తగదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ''హైదరాబాద్‌లో ఉద్యమం చేస్తున్నవారు తెలంగాణ అంగన్‌వాడీలు. వారిని ఏపీ వారు అని చెప్పడం సరికాదు'' అని అన్నారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు వివరాలు చెప్పడంతో వారు ఏపీకి చెందిన వారేనని అంగీకరించారు. ఈ విధంగా సమాచార లోపంతో చంద్రబాబు తప్పులో కాలేశారు.



అయితే ఈ విషయంలో చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. ప్రజా ఉద్యమాల గురించి సీఎం స్థాయి వ్యక్తికి తెలియకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీలకు న్యాయం చేసే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

మరోవైపు అంగన్‌ వాడీ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సమస్యలు పరిష్కరం విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నా వినకుండా ఆంధ్రప్రదేశ్‌ సీఎం అంగన్‌ వాడీ వర్కర్ల కనీస వేతనాలను పెంచడం లేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వం పెంచకపోతే పోరుబాట పట్టక తప్పదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమని హెచ్చరించారు.