Begin typing your search above and press return to search.

ఇవాంకాకు కోటి రూపాయ‌ల‌ నగలా?

By:  Tupaki Desk   |   26 Nov 2017 3:31 PM GMT
ఇవాంకాకు కోటి రూపాయ‌ల‌ నగలా?
X
ఇవాంకా ట్రంప్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇంతా అంతా హడావుడి చేయడం లేదు. ఆ హడావుడి చూసి నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ పై ఈ విషయంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాంకాకు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.కోటి విలువైన నగను బహుమతిగా ఇవ్వనుండడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు.

ప్రజల సొమ్మును కేసీఆర్ ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులను పట్టించుకోకుండా, హంగు, ఆర్భాటాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి పనులే దేశ పేదరికానికి కారణం అని మండిపడ్డారు. అంత భారీ మొత్తం ఖర్చు చేసి ఇవాంకాకు నగలను గిఫ్టుగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇవాంకా పర్యటన సందర్భంగా కనీవినీ ఎరుగని భద్రత కల్పిస్తోంది. మెరుపుదాడి చేసే పోలీసు జాగిలాలను భద్రతలో వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు కూడా స్పష్టంగా వీడియో తీసి అక్కడి పరిస్థితులను ప్రత్యేక కంట్రోల్‌ రూంకు చేరవేసే డ్రోన్లనూ వినియోగిస్తున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడికి కల్పించేంత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులు ప్రయాణించే ఔటర్‌పై భద్రతకు 30 కి.మీ.కు దూరంలో ఏకంగా 28 గస్తీ వాహనాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ వాహనాల్లో అత్యాధునిక ఆయుధాలతో భద్రతా సిబ్బంది సిద్ధంగా ఉంటారు.