Begin typing your search above and press return to search.

నిజం: ఆవులు అత్యంత‌ ప్ర‌మాద‌క‌రం

By:  Tupaki Desk   |   9 Nov 2015 10:30 PM GMT
నిజం: ఆవులు అత్యంత‌ ప్ర‌మాద‌క‌రం
X
ఆవు...హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన‌ది. స‌క‌ల దేవ‌త‌ల‌కు నిల‌యంగా భావించి పూజిస్తుంటారు కూడా. మ‌నదేశంలో ఇపుడు ఆవు కేంద్రంగా పెద్ద ర‌చ్చే సాగుతోంది. ఆవు మాంసం తినొద్దని హిందువాదులు డిమాండ్ చేస్తుంటే...అది హ‌క్కులు హ‌రించ‌డ‌మేన‌ని లౌకిక‌వాదులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే... ఏకంగా ఓ దేశంలో ఆవులు అత్యంత ప్రమాదకర జంతువులుగా ప్ర‌క‌టించేశారు. నిజంగా నిజ‌మండి బాబు. బ్రిట‌న్‌ లో ఈ మేర‌కు ఆ దేశ ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది.

బ్రిటన్‌ ఆరోగ్య, భద్రతా విభాగం తాజాగా ఈ మేరకు గణాంకాలు విడుద‌ల చేసింది. ఇందులో ఏం తేలిందంటే...కుక్కల కన్నా ఆవులు అత్యంత ప్రమాదకరమైన జంతువుల‌ని తేల్చింది. ఏ విధంగా అంటారా? రోడ్డు ప్ర‌మాదాల కోణంలోన‌ట‌. వివిధ సందర్భాలలో ఆవులు చేసిన దాడుల్లో గత పదిహేనేళ్లలో 74 మంది ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్‌ ఆరోగ్య, భద్రతా విభాగం తన లెక్కల్లో వివరించింది. ఎక్కువగా పొలాల్లో ఉండే ఆవులు రోడ్డెక్కి ఫుట్‌ పాత్‌ లపై తిరిగే పాదచారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయని ఆరోగ్య భద్రతా విభాగం తెలిపింది. దాదాపు టన్ను, అంతకన్నా ఎక్కువ బరువున్నఆవులు పాదచారులను తొక్కి చంపటం లేదా కొమ్ములతో పొడిచి చంపటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వివ‌రించింది.

ఈ జంతువుల దాడులకు గురై మరణించిన వారిలో 18 మంది విహారం కోసం తిరిగే వారు కాగా మరో 56 మంది వ్యవసాయ కార్మికులని ఈ విభాగం వెల్లడించింది. 2005-13 మధ్య కాలంలో సంభవించిన మరణాలలో 17 శాతం మంది ఆవుల వల్లే మృత్యువాత ప‌డ్డార‌ని ఆరోగ్య భద్రతా విభాగం నివేదిక తేల్చింది. ఈ నేపథ్యంలో రైతులు తమ పశుసంపదను రహదారులున్న పొలాల్లో వుంచరాదని ఈ విభాగం సూచించింది. 70 శాతం మరణాలు కొత్తగా ఈనిన ఆవు లేదా ఎద్దు వల్లే సంభవిస్తున్నాయని, అందువల్ల పశుసంపదను అత్యంత జాగ్రత్తగా పెంచుకోవాలని ఈ విభాగానికి చెందిన సలహా సంఘం రైతులకు సూచించింది. బ్రిటన్‌ లో ప‌రిస్థితుల‌పై ఆరోగ్య‌, భ‌ద్ర‌తా విభాగం నివేదిక ఇవ్వ‌గా వాటిని ఉటంకిస్తూ సన్‌డే టైమ్స్‌ పత్రిక వార్తా క‌థ‌నం రాసింది