Begin typing your search above and press return to search.

అక్కడ కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది.. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   17 Jan 2021 11:00 AM IST
అక్కడ కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది.. కారణం ఇదే!
X
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే.. అత్యధిక కేసులు, మరణాలు నమోదైన మహారాష్ట్రలో మాత్రం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది! దీంతో.. ఇవాళ, రేపు ఈ కార్యక్రమం నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

తొలుత వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలోని వారు వ్యాక్సిన్ కోసం కోవిన్ అప్లికేషన్‌లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా పేరు నమోదు చేసుకున్న వారికి వరుస క్రమంలో వ్యాక్సిన్ అందిస్తారు. అయితే.. మహారాష్ట్రలో ఈ కోవిన్ అప్లికేషన్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో.. 17, 18 తేదీలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇదిలాఉండగా.. దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ‘ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసింది’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొంది. మొదటి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. శనివారం టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని కూడా స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో జరిగిన ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో.. 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని కేంద్రం వెల్లడించింది. కాగా.. రెండు కంపెనీలకు చెందిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వినియోగిస్తున్న విషయం తెలిసిందే.