Begin typing your search above and press return to search.

మళ్ళీ కొవిడ్ ఆంక్షలు.. ఎన్నికలుంటాయా?

By:  Tupaki Desk   |   26 Dec 2021 10:31 AM GMT
మళ్ళీ కొవిడ్ ఆంక్షలు.. ఎన్నికలుంటాయా?
X
2022.. కొత్త ఏడాది ఎన్నికలతో ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్) ఎన్నికలతో హడావుడి నెలకొననుంది. ఇందులో అతి కీలకమైనవి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు. యూపీలో గెలుపే జాతీయ రాజకీయాలను నిర్దేశించే క్రమంలో ఆ రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యం గురించి చెప్పనవసరం లేదు. అందులోనూ యోగి ప్రభుత్వం గత ఐదేళ్లలో యూపీ రాజకీయాల తీరును మార్చింది.

అటు సమాజ్ వాదీ పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే, మరో కీలక పార్టీ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉనికే లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఆ పార్టీ బీజేపీని అడ్డుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్, సమాజ్ వాదీలకు సహకారం అందిస్తోందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కనపెట్టి చూస్తే మరో కీలక రాష్ట్రం పంజాబ్. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ఈ రాష్ట్రంలో నాలుగు పార్టీల హోరాహోరీ సమరం తప్పదనిపిస్తోంది. పంచ నదులు పారే పంజాబ్ చతుర్ముఖ పోటీ అన్నమాట. మిగతా రాష్ట్టాల్లో ఎన్నికలు పెద్ద విషయం కాదు. కాగా.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఈ ఎన్నికలను వాయిదా వేయించేలా ఉంది. జనాభా పరంగా (20 కోట్లు) దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఒమైక్రాన్ వ్యాప్తి రీత్యా ఎన్నికలంటే మామూలు మాటలు కాదు. అందుకే అలహాబాద్ హైకోర్టు సైతం ఎన్నికలను వాయిదా వేసే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని సూచించింది.

నిర్వహించాలా ? వద్దా ?

ఒమిక్రాన్‌ వ్యాప్తితో యూపీతో పాటు పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. రాత్రి కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఇవన్నీ కొత్త సంవత్సర వేడుకలను నిలువరించేందుకే అయినా.. తర్వాత కూడా కొనసాగించే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 27న కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతోమసమావేశం కానుంది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, యూపీ, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

అలహాబాద్‌ హైకోర్టు కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలోనూ ఎన్నికల సంఘం, ఆరోగ్యశాఖ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా.. వీలైతే రెండు నెలల పాటు వాయిదా వేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. మనుషులు ప్రాణాలతో ఉంటేనే కదా.. ప్రచారాలైనా.. ఎన్నికలైనా. ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రెండో దశ కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.