Begin typing your search above and press return to search.

కరోనా నాలుగో వేవ్ కు భారత్ సిద్ధంగా ఉండాల్సిందే...?

By:  Tupaki Desk   |   26 March 2022 8:48 AM IST
కరోనా నాలుగో వేవ్ కు భారత్ సిద్ధంగా ఉండాల్సిందే...?
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యూకే, యూరప్ వంటి దేశాల్లో ఇన్ఫెక్షన్లు నెమ్మదిగా పెరుగుతుండగా... చైనా, హాంగ్ కాంగ్ వంటి దేశాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. అయితే థర్డ్ వేవ్ ఎఫెక్ట్ అంతగా లేకపోయినప్పటికీ.. ఫోర్త్ వేవ్ మాత్రం కాస్త ఆందోళన కల్గిస్తోంది. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో కరోనా కారణంగా దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

అంతే కాదండోయ్ ప్రపంచ కరోనా మరణాల సంఖ్యంలో ఇండియా మూడో స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా తర్వాత 4 కోట్లకు పైగా ధ్రువీకరించిన కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మరి కరోనా నాలుగో వేవ్ ను తట్టుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందా లేదా అన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే భారత్ లో రోజువారీ నమదయ్యే కేసుల సంఖ్య రెండేళ్ల కనిష్ట స్థాయి పడిపోవడం చెప్పుకోదగ్గ అంశం.

50 జన్యు పరివర్తనాలను కల్గి ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తాజా ఇన్ఫెక్షన్లను కల్గిస్తోంది. కానీ భారత్ లో మాత్రం ఈ వేరియంట్ కేసులు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి 21న భారత్ లో అత్యధికంగా 3 లక్షల 47 వేల కేసులు నమోదవ్వగా... మార్చి 21 నాటికి వీటి సంఖ్య 1410 కి పడిపోయింది. అయితే కేసుల సంఖ్య చాలా వేగంగా తగ్గింది. మిగతా వేవ్ లతో పోలిస్తే కూడా ఈసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.

ఇందుకు ప్రధాన కారణాలు ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడమేనని చెబుతున్నారు. అయితే భారత్ ఇప్పటి వరకు 1.8 బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించింది. 80 శాతానికి పైగా వయోజనులు పూర్తి స్థాయి డోసులు తీసుకోగా... 94 శాతం మంది మొదటి డోసును తీసుకున్నారు. ఈ కారణాల వల్లే కరోనా నిబంధనలు కూడా ఎత్తివేశారు. అన్ని వ్యాపార రంగాలు మునుపటి స్థితికి వచ్చాయి. ఇప్పుడిప్పుడే భారత్ ఊపిరి పీల్చుకుంటుందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.

అయితే ఇప్పుడు మళ్లీ కరోనా నాలుగో వేవ్ రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నా... మరికొందరు పర్వాలేదని చెప్తున్నారు. కరోనా నాలుగో వేవ్ జూన్ లో ప్రారంభం అయి ఆగస్టులో తారా స్థాయికి చేరుకుంటుందని పలువురు అంచనా వేశారు. కానీ చాలా మంది అంటు వ్యాధుల నిపుణులు మాత్రం అంత సమస్య వచ్చే అవకాశం లేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భారతీయులు చాలా వరకు మంచి రోగ నిరోధక శక్తిని కల్గి ఉన్నారని... అలాగే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారని గుర్తు చేశారు. అందువల్ల కరోనా నాలుగో వేవ్ వచ్చినా తట్టుకునే శక్తి భారతీయులకు ఉందని... ఈ విషయంపై ప్రజలెవరూ అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఒక ఫిజీషియన్ ఎపిడెమాలజిస్ట్, డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు.