Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ఏమైంది? దడ పుట్టేలా పెరుగుతున్న కేసులు..

By:  Tupaki Desk   |   6 Jan 2022 2:30 AM GMT
హైదరాబాద్ కు ఏమైంది? దడ పుట్టేలా పెరుగుతున్న కేసులు..
X
కొత్త సంవత్సరం అడుగు పెట్టటానికి నాలుగైదు రోజుల ముందు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కీలక అధికారి మూడో వేవ్ వచ్చేసిందని చెప్పేయటం తెలిసిందే. ఆయన అన్నారే కానీ.. అన్నంతనే వచ్చేస్తుందా? అన్న సందేహాల్ని కొందరు వ్యక్తం చేశారు. అయితే.. గడిచిన వారం వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల జోరు చూస్తే.. ఇప్పుడు గుండె బేజారైపోతున్న పరిస్థితి. బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1520 కొత్త కేసులు నమోదైనట్లుగా తేలింది.

ఇందులో అత్యధికం హైదరాబాద్ మహానగరానికి చెందిన కేసులే కావటం గమనార్హం. మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 979 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి జిల్లాలో 174, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో ప్రధాన కేసులన్ని కూడా హైదరాబాద్ మహానగర శివారులోనే ఉంటాయన్న మాట వినిపిస్తోంది.

ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. వారం వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిపోతున్న కేసుల సంఖ్య.. దాని వేగం చూస్తే.. అందరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుందని చెప్పాలి. డిసెంబరు 30న జీహెచ్ఎంసీ పరిధిలో 167 కేసులు నమోదు అయితే.. 31న 198, జనవరి 1న 217 కేసులు నమోదయ్యాయి. ఇక్కడి వరకు కేసుల పెరుగుదల వేగం ఒక మోస్తరుగానే ఉంది. కానీ.. జనవరి 2 తర్వాత నుంచి మాత్రం వేగం అంచనాలకు మించినట్లుగా సాగుతోంది.

జనవరి 2న 212 కేసులు నమోదైతే.. జనవరి 3న 294 కేసులు నమోదయ్యాయి. అనూహ్యంగా జనవరి 4న మాత్రం 659 కేసులు నమోదు అయ్యాయి. అంటే.. రోజులో 225శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఇంత భారీగా కేసుల పెరుగుదలా? అన్న విస్మయంలో ఉన్నంతలో ఈ రోజు బులిటెన్ విడుదల కావటం.. ఈసారి ఏకంగా 979 కేసులకు వెళ్లిపోవటం చూస్తే.. ట్రిఫుల్ డిజిట్ రేపు దాటేయమే కాదు.. మరిన్నికేసులు నమోదుకావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూసినప్పుడు గడిచిన వారంలో.. చివరి మూడు రోజుల్లో చోటు చేసుకున్న మార్పులు.. కేసుల నమోదు పెరుగుదలను చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదు ఖాయమన్న భావన కలుగక మానదు.