Begin typing your search above and press return to search.

సంపన్న దేశాలు వ్యాక్సిన్ ను అడ్వాన్స్ కబ్జా?

By:  Tupaki Desk   |   3 Aug 2020 2:30 AM GMT
సంపన్న దేశాలు వ్యాక్సిన్ ను అడ్వాన్స్ కబ్జా?
X
ఇటీవల కాలంలో ప్రపంచం ఎప్పుడూ ఎదురుచూడని చిత్రమైన పరిస్థితిని తీసుకొచ్చింది కరోనా. చైనాలో షురూ అయిన ఈ వైరస్ తమ వరకు రాదన్న మితిమీరిన నమ్మకం.. తప్పిన అంచనాలకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. కరోనా తీవ్రత అర్థమయ్యేసరికి ప్రపంచ దేశాలన్ని ఎంతలా ప్రభావితం కావాలో అంతలా ప్రభావితం అయ్యాయన్నది మర్చిపోకూడదు. గడిచిన కొద్ది నెలలుగా దీని తీవ్రత అర్థం కావటమేకాదు.. దీని నుంచి బయటకు రావటం ఎలానో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి.

ఇలాంటివేళ ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా వ్యాక్సిన్ తయారీ కోసం 120కు పైగా ప్రయోగాలు సాగుతున్నాయి. ఇందులో కొన్ని ప్రయోగాల మీద ప్రపంచం మొత్తానికి ఆసక్తి వ్యక్తమవుతోంది. దీంతో.. వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై చాలా దేశాలు వెయిట్ చేస్తుంటే.. సంపన్న దేశాలు మాత్రం అందుకు భిన్నంగా అడ్వాన్స్ గా వ్యాక్సిన్ బుక్ చేసుకుంటున్నాయి.

ఒక అంచనా ప్రకారం సంపన్న దేశాలు ఇప్పటికే బిలియన్ డోసుల వ్యాక్సిన్ ను బుక్ చేశాయని చెబుతున్నారు. సంపన్న దేశాలు తమ అడ్వాన్స్ బుకింగ్ లతో సదరుకంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు తన్నుకు పోయేందుకు కుదుర్చుకుంటున్న ఒప్పందాలు మిగిలిన దేశాలకు వారికి కొత్త కంగారును తెప్పిస్తున్నాయి. ప్రముఖ కంపెనీల వ్యాక్సిన్ లకు అనుమతులు లభించి.. బయట మార్కెట్లకు విడుదల చేసేందుకు ఓకే చెప్పినంతనే.. అంతకు ముందే బుకింగ్ చేసుకున్న సంపన్న దేశాలకు వీటిని అందించాల్సి ఉంటుంది. యూరోపియన్ దేశాలతో పాటు అగ్రరాజ్యమైన అమెరికా ఈ బుకింగ్ లో ముందుందని చెప్పక తప్పదు.

ప్రపంచానికి ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. దానికి చెక్ చెప్పే మందుల్ని సంపన్న దేశాలు గద్దల్లా తన్నుకు పోవటం మొదటి నుంచే ఉంది. దాదాపుపదకొండు సంవత్సరాల క్రితం స్వైన్ ఫ్లూ వణికించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనూ సంపన్న దేశాలే వ్యాక్సిన్ తన్నుకెళ్లాయి. అమెరికా.. బ్రిటన్ తో పాటు యూరోపియన్.. జపాన్ దేశాలు ఇప్పటివరకు 1.3 బిలియన్ల డోసుల్ని బుక్ చేసినట్లుగా బ్రిటన్ కు చెందిన ఎయిర్ ఫినిటీ అనే సంస్థ వెల్లడించింది.

ఇక.. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు భారీ డిమాండ్ ఉంది. తన భాగస్వామి సంస్థ అయిన ఆస్ట్రాజెనెకా.. ఫైజర్.. బయో ఎన్ టెక్.. ఎస్ ఈ కొలాబరేషన్ లాంటి కొన్ని ఫ్రంట్ రన్నర్లు వ్యాక్సిన్ తయారీలో మహా దూకుడును ప్రదర్శిస్తున్నాయి. మొత్తంగా వ్యాక్సిన్ తయారైన వెంటనే.. అవన్నీ తమకే చెందాలని.. ముందుగా తయారు చేసేవన్నీ తమకే సొంతం కావాలన్న ఆశను సంపన్న దేశాలు ప్రదర్శిస్తున్నాయి. అయితే.. అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామన్న మాట వినిపిస్తున్నా.. వాస్తవంలో అదెంత వరకు సాధ్యమన్నది సందేహంగా ఉందని చెప్పక తప్పదు.