Begin typing your search above and press return to search.

వారసత్వం హక్కులు కుతురుకా.. కోడలికా? ఎవరికి ఎక్కువ..!!

By:  Tupaki Desk   |   8 Dec 2021 4:09 AM GMT
వారసత్వం హక్కులు కుతురుకా.. కోడలికా? ఎవరికి ఎక్కువ..!!
X
కుటుంబ వ్యవహారాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తన ఇంటి పేరు మార్చుకుని మరో కుటుంబంలో కి కోడలిగా అడుగుపెట్టిన వ్యక్తికి... కడుపున పుట్టిన కూతురి కంటే ఎక్కువ హక్కులు వర్తిస్తాయని తీర్పు ఇచ్చింది. కోడలుగా ఉన్న ఆమె విధవరాలైన కూడా.. ఆమెకు కూతురి కంటే ఆస్తిలో లేదా వారసత్వంలో ఎక్కువ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. వేరే కుటుంబం నుంచి వచ్చినా సరే అక్కడ బాధ్యతలను తనవిగా భావించి భుజాలకు ఎత్తుకునే ఆమెకు కుటుంబ వారసత్వంగా వచ్చే ఏ అంశంపైన అయినా సర్వ హక్కులు ఉంటాయని ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇందుకు తగినట్లుగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలను సవరించాలని ఆదేశించింది. కుటుంబానికి సంబంధించిన వారసుల జాబితాలో కోడలు అని కూడా చేర్చాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

వేరు వేరు రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను చేస్తాయని గుర్తించిన హైకోర్టు... 2016లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది కచ్చితంగా కోడలుకు కుటుంబంలో సమాన హక్కులు కల్పించాలని.. ఇందుకు తగ్గట్టుగా తిరిగి ఉత్తర్వులను జారీ చేయాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. 2016 లో రేషన్ పంపిణీకి సంబంధించి.. పరాయి ఇంటి నుంచి వచ్చిన కోడలను ఇంటి సభ్యురాలిగా గుర్తించకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంటికి సంబంధించిన వారసత్వ హక్కులు ఆమెకు అందడం లేదని హైకోర్టు అభిప్రాయ పడింది.

యూపీ కి చెందిన ఓ మహిళ... భర్త చనిపోవడం కారణంగా ఆమె అత్తతో జీవనం సాగించేది. కొద్ది రోజులకు అత్త కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె అత్త పేరు మీద ఉండే రేషన్ షాప్ ను తన పేరు మీదకు బదిలీ చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసింది. దీనిపై సమగ్రంగా పరిశీలించిన అధికారులు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు... ఆమె సమర్పించిన దరఖాస్తును కొట్టేశారు. ఈ విషయంపై కోర్టును బాధితురాలు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఆమెకు రేషన్ షాప్ ను ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

తన ఇంటి పేరును సైతం మార్చుకొనే మరొక ఇంటికి వచ్చి కోడలిగా అన్ని బాధ్యతలు నిర్వహించే ఆడవారికి ఇది ఓ శుభవార్త కానుంది. ఇప్పటికి కూడా మన సమాజంలో అత్త స్థానంలో ఉండే ఎక్కువ మంది కోడలికి కంటే కూతురికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కోడలికే ఎక్కువ అవకాశాలు, హక్కులు కుటుంబంపై ఉంటాయని స్పష్టమైంది.