Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు ముందే సూసైడ్ చేసుకోబోయిన దంపతులు

By:  Tupaki Desk   |   4 Oct 2021 11:00 PM IST
ఏపీ హైకోర్టు ముందే సూసైడ్ చేసుకోబోయిన దంపతులు
X
న్యాయం కోసం కాళ్లు అరిగేలా తిరిగి.. ఎట్టకేలకు కేసు గెలిచిన తర్వాత కూడా.. ఒత్తిళ్లు ఎదురుకావటంతో విసుగు చెందిన దంపతులు ఇద్దరు ఏపీ హైకోర్టు న్యాయస్థానం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన వైనం సంచలనంగా మారింది. ఒక స్థల వివాదం విషయంలో హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికి.. అది అమలుకాని నేపథ్యంలో దంపతులు ఇద్దరూ వేదనతో విసుగు చెందారు. దీంతో వారు హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెరందిన దంపతులు దేవేంద్ర రావు.. భానుశ్రీలు. వారి ఇంటి స్థలానికి సంబంధించిన వివాదం కొంతకాలంగా సాగుతోంది. దీనికి సంబంధించిన ఇష్యూలో కొందరు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొంటూ వారు కోర్టును ఆశ్రయించారు. 2003నుంచి తాము నివాసం ఉంటున్న ఇంటిని.. 2017లో బస్ షెల్టర్ నిర్మాణం కోసం బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారు.

అయితే. కోర్టు మాత్రం ఈ దంపతులకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవటం.. అందుకు అడ్డు పడుతున్న స్థానిక నేతల తీరుతో వారిద్దరూ విసిగిపోయారు. తాజాగా డీజీల్ సీసాను తీసుకొని ఏపీ హైకోర్టు ఆవరణలో ఆత్మహత్యను చేసుకోబోయారు. వీరి తీరుపై అనుమానంగా ఉన్న అక్కడి వారు వెంటనే స్పందించి వారిని కాపాడే ప్రయత్న చేశారు. హైకోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాక.. ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.