Begin typing your search above and press return to search.

పిల‌వ‌ని పెళ్లికి వెళ్లి సంద‌డి చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   11 May 2018 5:21 AM GMT
పిల‌వ‌ని పెళ్లికి వెళ్లి సంద‌డి చేసిన కేసీఆర్
X
నాట‌కీయ‌త‌ను ర‌క్తి క‌ట్టించ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఈ మ‌ధ్య‌నే త‌న స్నేహితుడి కోసం గుడి బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌ట‌మే కాదు.. ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత త‌న ఇంటికి పిలిచి మ‌రీ.. స‌న్మానించిన వైనం గుర్తుండే ఉంటుంది. ఈ త‌ర‌హా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. తాజాగా ఆయ‌న చేసిన ప‌ని తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇలాంటివి కేసీఆర్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రేమో?

ఊహించ‌నిరీతిలో వ్య‌వ‌హ‌రించి అంద‌రిని విస్మ‌యానికి గురి చేయ‌టం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేయటంలో కేసీఆర్ మొన‌గాడ‌ని చెప్పాలి. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో స్వీట్ షాకులు ఇచ్చే కేసీఆర్‌.. తాజాగా ఊహించ‌నిరీతిలో వ్య‌వ‌హ‌రించారు. దేశంలోనే మ‌రెక్క‌డా లేని రీతిలో.. ఏడాదికి రూ.12వేల కోట్ల ఖ‌ర్చుతో అమ‌లు చేయ‌నున్న రైతుబంధు ప‌థ‌కాన్ని గురువారం స్టార్ట్ చేసిన వైనం తెలిసిందే.

ఈ ప‌థ‌కం మీద దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీగా ప్ర‌చారం చేసేందుకు వీలుగా రూ.100 కోట్లు (?) ఖ‌ర్చు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ మొత్తాన్ని కేవ‌లం ఒక రోజు ప్ర‌చారం కోసం కేటాయించ‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. గేమ్ ఛేంజ‌ర్ గా భావిస్తున్న రైతుబంధు ప‌థ‌కాన్ని స్టార్ట్ చేసేందుకు క‌రీంన‌గ‌ర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ప‌థ‌కాన్ని ప్రారంభించి తిరిగి వెళుతున్న వేళ‌.. దారి మ‌ధ్య‌లో (క‌రీంన‌గ‌ర్‌-వ‌రంగ‌ల్‌)ని ఒక పల్లెటూరిలో (తాడిక‌ల్‌) సంద‌డిగా పెళ్లి జ‌రుగుతోంది. మామూలుగా అయితే.. ఏ ముఖ్యమంత్రి అయినా ఆగ‌కుండా వెళ్లిపోయేవారు. కానీ.. కేసీఆర్ తీరు వేరుగా ఉంటుంది క‌దా. పెళ్లి వేడుక జ‌రుగుతున్న వైనాన్ని చూసిన ఆయ‌న‌.. తాను ప్ర‌యాణిస్తున్న బ‌స్సును ఆపించారు.

బ‌స్సు దిగిన ఆయ‌న నేరుగా పెళ్లి మండ‌పంలోకి వెళ్లారు. అప్ప‌టివ‌ర‌కూ త‌మ లోకంలో తాము ఉన్న వారికి.. సీఎం కేసీఆర్ స్వ‌యంగా త‌ర‌లిరావ‌టంతో వారిని ఆనందంలో ముంచెత్తింది. ఇక‌.. పెళ్లికొడుకు.. కుమార్తెల‌కైతే ఇదో పెద్ద స‌ర్ ప్రైజ్ గా మారింది.

సీఎమ్మే స్వ‌యంగా త‌మ పెళ్లికి హాజ‌రై.. ఆశీర్వ‌దించ‌టంతో వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిర‌య్యారు. పెళ్లి మండ‌పంలోకి వెళ్లిన కేసీఆర్ అక్క‌డి వారిని న‌మ‌స్క‌రించి.. వ‌ధూవ‌రులు కావ్య‌.. మ‌నోహ‌ర్ ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆక్షింత‌లు వేసి ఆశీర్వ‌దించారు. జ‌రుగుతున్న‌ది క‌లా?  నిజ‌మా?  అన్న‌ది అర్థం కాని వేళ‌.. కేసీఆర్ మ‌రోసారి రియాక్ట్ అయ్యారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న క‌ల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా ఆర్థిక సాయాన్ని అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. సినిమాటిక్ గా చోటు చేసుకున్న ఈ ఉదంతంతో నూత‌న దంప‌తులు మొద‌లుకొని పెళ్లికి వ‌చ్చిన వారంతా తెగ ఆనంద‌ప‌డిపోయారు. త‌న చ‌ర్య‌ల‌తో జీవితంలో మ‌ర్చిపోలేని రీతిలో ఆనందాన్ని క‌లిగించే ఆర్ట్ కేసీఆర్ లో ట‌న్నులు.. ట‌న్నులు ఉంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. కేసీఆర్ తాజా ఎపిసోడ్ నేప‌థ్యంలో పిల‌వ‌ని పేరంటానికి వెళ్ల‌కూడ‌ద‌న్న సామెత‌ను స‌వ‌రిస్తే బాగుంటుందేమో?