Begin typing your search above and press return to search.

రికార్డు స్థాయిలో హ‌నీమూన్‌..!

By:  Tupaki Desk   |   3 Nov 2016 10:30 PM GMT
రికార్డు స్థాయిలో హ‌నీమూన్‌..!
X
పెళ్లైన కొత్త జంట హ‌నీమూన్‌ కి వెళ్ల‌డం అనేది స‌ర్వ‌సాధార‌ణమైపోయింది. ఒక‌రిని ఒక‌రు అర్థం చేసుకోవ‌డం కోసం.. ఏకాంతంగా కొన్నాళ్లు గ‌డ‌ప‌డం కోసం దేశ‌విదేశాల‌కు హ‌నీమూన్‌కి వెళ్తుంటారు. హ‌నీమూన్ డేస్ ని ఎమొర‌బుల్ గా మార్చుకునేందుకు వివిధ ప్రాంతాల‌కు వెళ్తుంటారు. అయితే, హనీమూన్ అంటే ఏదో ఒక ప్ర‌దేశానికి వెళ్లి వ‌చ్చేయ‌డం ప‌రిపాటి. కానీ, అంద‌రిలా హ‌నీమూన్ కి వెళ్లి రావ‌డం రొటీన్ అనుకున్నారో ఏమో... కాస్త డిఫ‌రెంట్ గా ప్లాన్ చేసుకుందీ ఈ జంట‌! త‌మ హ‌నీమూన్ ను ఒక బోటులో చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ బోటు లోనే జ‌స్ట్ ఓ 2,500 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాల‌ని అనుకున్నారు. హ‌నీమూన్ చేసుకుంటూనే ఒక ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాల‌ని డిసైడ్ చేసుకుందీ జంట‌.

రియాన్ మాన్సెర్‌, భ‌ర్త గోల్డెన్ హ్యూస్‌... ఈ ఇద్ద‌రు న్యూయార్క్ లో ఉంటున్నారు. ఒక చిన్న బోటు తీసుకుని 2,500 కిలో మీట‌ర్ల దూరాన్ని ప్ర‌యాణించాల‌ని డిసైడ్ చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో లోని మోంటెరీ హార్బ‌ర్ నుంచి హ‌వాయ్ లోని ఓహ్యూ హార్బ‌ర్ కు మ‌ధ్య ఉన్న దూరాన్ని అత్యంత వేగంగా చేరుకోవాల‌ని ప్ర‌యాణం ఆరంభించారు. ప‌గ‌లూ రాత్రీ తేడా లేకుండా భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ ప‌డ‌వ న‌డిపారు. ఒక‌రు నిద్ర‌పోతుంటే మ‌రొక‌రు షిఫ్టుల వారీగా ప‌డ‌వ న‌డిపారు. ఎండా వానా గాలీ మంచూ ఇలాంటి వాతావ‌ర‌ణ పరిస్థితుల‌ను త‌ట్టుకుంటూ ప్ర‌యాణం సాగించారు. ఈ ప్ర‌యాణంలో అవ‌స‌ర‌మ‌య్యే ఆహార ప‌దార్థాలు, ఇత‌ర టెక్నిక‌ల్ డివైజ్ లు వెంట తెచ్చుకున్నారు.

ఈ ప్రేమ యాత్ర సినిమాల్లో చూపించినంత ఈజీగా హాయిగా సాగ‌లేదు. ఎన్నో ఒడిదొడుకుల‌కు ఓర్చుకుని ఏకంగా 39 రోజుల‌పాటు ఆ ప‌డ‌వ‌లోనే ప్ర‌యాణం సాగించి, ల‌క్ష్యాన్ని చేరుకున్నారు. ఇదో ప్ర‌పంచ రికార్డు. గ‌తంలో ఇదే దూరాన్ని 45 రోజుల్లో అధిగ‌మించిన రికార్డును ఈ జంట క్రాస్ చేసింది. 39 రోజుల‌పాటు ఒక చిన్న బోటులో భార్యాభ‌ర్త‌లిద్ద‌రే క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం.. ర‌క‌ర‌కాల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకోవ‌డం... ఇంత‌కంటే గొప్ప హ‌నీమూన్ ఏముంటుంది..? ఇంత‌కంటే జీవిత పాఠం ఇంకేముంటుంది చెప్పండి..! వారి ప్ర‌యాణంలో ఎదురైన కొన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌నూ ఇత‌ర అనుభ‌వాల‌నూ వీడియో తీశారు కూడా! ఆ వీడియో మీరూ చూడండి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/