Begin typing your search above and press return to search.

దేశ వ్యాప్తంగా హై అలర్ట్ : దేనికోసమంటే ?

By:  Tupaki Desk   |   8 Nov 2019 11:06 AM GMT
దేశ వ్యాప్తంగా హై అలర్ట్ :  దేనికోసమంటే ?
X
ఇండియన్ గవర్నమెంట్ దేశం లో హై అలర్ట్ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం అయోధ్య లోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదం పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ తన తుది తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో.. దేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి ప్రదేశాలు నిత్యం జనసమ్మర్థంతో కూడుకుని ఉంటాయి. అలాంటి చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే.. దాని ఫలితం చాలా భయానకంగా ఉంటుంది.

అలాంటి వాటిని అరికట్టడానికి రైల్వే మంత్రిత్వ శాఖ వెంటనే కార్యాచరణలోకి దిగింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు భద్రతాపరమైన అడ్వైజరీని పంపించింది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉండగా.. వాటి పరిధిలోని సమస్యాత్మకమైన, సున్నితమైన రైల్వే స్టేషన్లలో రౌండ్ ద క్లాక్ భద్రతా బలగాలను మోహరింపజేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా అత్యంత సున్నితమైనవిగా మొత్తం 78 రైల్వే స్టేషన్లను గుర్తించింది రైల్వే శాఖ. అక్కడ కనీవినీ ఎరుగని భద్రత చర్యలను చేపట్టింది.

ప్రతి ప్రయాణికుడిని, ప్రతి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేయాల్సిందేనంటూ ఆదేశించింది. భద్రతాపరమైన చర్యలను తీసుకోవడంలో ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు సెక్యూరిటీ అడ్వైజరీలో స్పష్టం చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల గుండా రాకపోకలు సాగించే రైళ్లకు కూడా ఆర్పీఎఫ్ భద్రతను కల్పించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. నడుస్తున్న రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సాయుధ బలగాలతో భద్రత కల్పించేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఏదైనా జరగాని సంఘటన జరిగితే.. దాని ఫలితాలు దారుణంగా ఉంటాయనే విషయాన్ని పదే పదే గుర్తు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.