Begin typing your search above and press return to search.

అన్నా ఉవాచ:దేశానికి పెద్ద సమస్య రిజర్వేషన్లే

By:  Tupaki Desk   |   11 Oct 2015 3:52 AM GMT
అన్నా ఉవాచ:దేశానికి పెద్ద సమస్య రిజర్వేషన్లే
X
సామాజిక కార్యకర్త అన్నాహజారే ఉన్నట్లుండి రిజర్వేషన్ లపై విరుచుకుపడ్డారు. స్వాంతంత్ర్యానంతరం కొంత కాలం మాత్రమే అమలుకు ఉద్దేశించిన రిజర్వేషన్ అంశం ప్రస్తుతం యావద్దేశానికే ప్రమాదకరంగా మారిందని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఈ సమస్యలో జోక్యం చేసుకోవడమే దీనికి కారణం అని ఆరోపించారు. అయితే రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిలించిన అన్నా హజారే భారతదేశంలో కొన్నివర్గాలకు ఇప్పటికీ రిజర్వేషన్లు అవసరమా కాదా అనే వాదనపై స్పష్టతను ఇవ్వలేకపోయారు.

ఆయన సమస్యల్లా రిజర్వేషన్ల అంశంలో రాజకీయ పార్టీల జోక్యం మీదే అయితే ఆయన అభిప్రాయంలో తప్పేమీ లేదు. కానీ రాజకీయ నేతలు రిజర్వేషన్లను తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నాయనేది వాస్తవమే అయినప్పటికీ 68 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు, కులాలు ఇంకా వెనుకబాటుతనంతో కూరుకుపోయి ఉన్న చేదు వాస్తవాన్ని విస్మరించి మొత్తం రిజర్వేషన్లపైనే ఒక అలవోక వ్యాఖ్య చేయడం ద్వారా అన్నా హజారే దేన్ని స్పష్టం చేస్తున్నట్లో బోధపడటం లేదు.

ప్రత్యేకించి రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలని లేదా తమకూ రిజర్వేషన్లు వర్తింపచేయాలని గుజరాత్‌లో కొత్తగా పొడుచుకువచ్చిన పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేలే టముకు వాయిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల దుష్పలితాల గురించి మీడియా చిలువలు పలువలుగా చర్చలు సాగిస్తున్న నేపథ్యంలో అన్నా హజారా రిజర్వేషన్ల అవసరంపై ఏవైపు నిలవబోతున్నారు అన్నది ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేయడం లేదు. అమలులో లోపాలుంటే వాటిని సరిదిద్దుకుని మరింత సమర్థవంతంగా వాటిని అమలు చేయాలని చెబుతున్నారా లేదా రాజకీయనేతల స్వార్థాన్ని సాకుగా చెప్పి తానూ రిజర్వేషన్ల రద్దుపై ఒక రాయి వేయడానికి సిద్ధపడ్డారా అనేది స్పష్టం కావడం లేదు.

పనిలో పనిగా అన్నాహజారే ప్రస్తుతం దేశ సమస్యగా మారిపోయిన గొడ్డు మాంసం రాజకీయాలపై ధ్వజమెత్తారు. బీఫ్‌ ను ఆహారంగా స్వీకరించడంపై ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకంత తీవ్ర స్థాయిలో రగడ సృష్టిస్తున్నాయని ప్రశ్నించారు. గత 68 ఏళ్లుగా వారు ఈ దేశంలో గొడ్డు మాంసాన్ని చూడటం లేదా? ఇప్పుడే ఇది నిషిద్ధ వస్తువులా వారికి కనబడుతోందా? అంతా రాజకీయాలు చేస్తున్నారని హజారే విమర్శించారు.

అంతా బాగానే ఉంది గానీ.. అన్నా వంటి సామాజికవేత్త.. రిజర్వేషన్ లపై అభిప్రాయం చెప్పినప్పడు.. అందులో ఇటీవల ఆరెస్సెస్ వెల్లడించన అభిప్రాయం గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆయన మాటలు.. ఆరెస్సెస్ భావజాలానికి దగ్గరగానే ఉన్నాయి. మరి ఆయన ఎలా భావించుకుంటున్నారో ఏమో?